దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క యంగ్ హీరోల సినిమాల్లో రొమాన్స్ చేస్తూనే.. మరోపక్క లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటిస్తోంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'దోస్తానా 2', 'గుడ్ లక్ జెర్రీ', 'మిలి' వంటి సినిమాల్లో నటిస్తోంది. అయితే చాలా కాలంగా ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్ లో హీరోయిన్ పరిచయం కాబోతుందని ప్రచారం జరిగింది. అలానే రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోల సినిమాల్లో ఆమెని తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై జాన్వీకపూర్ తండ్రి బోనీకపూర్ క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మించిన 'వలిమై' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బోనీకపూర్ కి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ తో సినిమా గురించి ప్రశ్నించగా.. తను కూడా సోషల్ మీడియాలోనే వింటున్నానని.. ఇప్పటివరకు అయితే ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే జాన్వీకపూర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెప్పారు.
ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె నటిస్తుందని.. తన తల్లి లెగసీను కంటిన్యూ చేస్తుందని చాలా నమ్మకంగా చెప్పారు. మంచి కథ సెట్ అయితే త్వరలోనే ఆమె ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక బోనీకపూర్ కూడా సౌత్ ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ తో 'వకీల్ సాబ్' సినిమా తీసిన ఆయన ఇప్పుడు అజిత్ తో 'వలిమై' తీశారు. ఫ్యూచర్ లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మించబోతున్నారు.