బిగ్ బాస్ సీజన్ 5 పంతొమ్మిది మంది కంటెస్టెంట్లతో సందడిగా ప్రారంభమైంది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో మొదటి రెండో రోజుల నుంచే మసాలా కంటెంట్, గొడవలు, అలకలు, ఏడుపులు అన్నీ మొదలైపోయాయి. ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు, కర్రీల కోసం గొడవపడడాలు చూస్తుంటే కెమెరాల ఫోకస్ కోసం అందరూ తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. కాగా ఈసారి నామినేషన్లో ఆరుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. వారిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న దానిపై వీక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ వారం ఎలిమినేషన్లో మోడల్ జెస్సీ, యాంకర్ రవి, మానస్, హమీదా, ఆర్జే కాజల్, సరయూ ఉన్నారు. వీరిలో యాంకర్ రవి నామినేషన్లో ఉన్నా లేనట్టే లెక్క. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది కనుక ఓట్లు పడతాయి. ఇక సరయూ కూడా యూట్యూబ్ ఫ్యాన్స్ తక్కువేమీ కాదు. ఆమె కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఆర్జే కాజల్ బిగ్ బాస్ కు కావాల్సిన కంటెంట్ ను బాగానే ఇస్తోంది. కాబట్టి ఆమెకు ఎలిమినేషన్ గండం ఉండకపోవచ్చు. ఇక మిగిలింది హమీదా, జెస్సీ, మానస్.
మానస్ సీరియల్స్ చూసే వాళ్లకి పరిచయమే కానీ హమీదా, జెస్సీ... వీరిద్దరూ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. జెస్సీ అమాయకంగా కనిపిస్తున్నప్పటికీ ఇంట్లో పలువురితో గొడవలు అయిన కారణంగా అతనికి వీక్షకుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అంతేకాదు జెస్సీ తరచూ కళ్ల నీళ్లు పెట్టుకోవడం, చాలా కన్ఫ్యూజన్ గా కనిపిస్తుండడం... అతనికి మైనస్ లుగా మారాయి. హమీదాను కాపాడి బిగ్ బాస్ జెస్సీ ఎలిమినేట్ చేయచ్చేమో అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. అంతేకాదు ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ పేరునే చెప్పారు మెజారిటీ హౌస్ మేట్స్. అతడిని జైలులో కూడా వేశారు బిగ్ బాస్. దీంతో అతని ఎలిమినేషనే ఖాయమేమో అనిపిస్తోంది చూసేవాళ్లలో. కచ్చితంగా హమీదా లేదా జెస్సీలలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ నుంచి తమ ఇంటికి చేరుకుంటారని అనుకుంటున్నారు. కానీ మూడు రోజుల క్రితం శ్రీరామ చంద్ర - హమీదాల మధ్య లవ్ ట్రాక్ నడిపేందుకు బిగ్ బాస్ ఓ ప్రోమో వేశారు. సీజన్ 4 లో అఖిల్-మోనాల్ లాగా ఓ జంటని సీజన్ 5లో కూడా హైలైట్ చేయాలని బిగ్ బాస్ తాపత్రయం. మరి ఇలాంటి సమయంలో సింగిల్ గర్ల్ హమీదాని బయటికి పంపే అవకాశం ఉండకపోవచ్చు. అలా చూసినా జెస్సీకీ ముప్పు కనిపిస్తోంది.
ఇక మానస్... సీజన్ 4లో అభిజిత్ ను గుర్తుకుతెస్తున్నాడు మానస్. చాలా పద్దతిగా, ఎక్కడా ఎమోషన్ లూజ్ అవ్వకుండా, అతిగా మాట్లాడకుండా.... తన కూల్ నెస్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కానీ ఈయన నుంచి బిగ్ బాస్ కు పెద్దగా కంటెంట్ రావడం లేదు. కాబట్టి మానస్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడని చెప్పుకోవాలి.
Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు
Also read: ఉదయం లేచాడు.... భార్యాకూతురిని కూడా మర్చిపోయాడు... ఇదో వింత జబ్బు