Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదట్లో శివాజీకి వచ్చిన పాపులారిటీ, ఓటింగ్ చూస్తే.. ఈ సీజన్‌కు తనే విన్నర్ అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ గత కొన్నివారాలుగా శివాజీ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. కొందరు కంటెస్టెంట్స్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ.. వారి క్యారెక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంతే కాకుండా కొందరితో అసలు కలవకుండా దూరంగా ఉంటున్నాడు. తనే కరెక్ట్ అనే మనస్థత్వం పెరిగిపోయింది. అలాంటి శివాజీకి తాజాగా హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయే అవకాశం వచ్చింది. కానీ తను వెళ్లకుండా నాగార్జున ఆపారు. అంతే కాకుండా ఆ తర్వాత నాగార్జున ముందే కొందరు కంటెస్టెంట్స్‌పై గట్టిగట్టిగా అరుస్తూ వ్యాఖ్యలు చేశాడు శివాజీ.
శివాజీని వెళ్లిపోకుండా ఆపిన నాగార్జున..
కొన్నివారాల క్రితం ఒక టాస్క్‌లో శివాజీ చేతికి గాయమయ్యింది. అప్పటినుండి ఆయన పూర్తిస్థాయిలో గేమ్స్‌లో పాల్గొనలేకపోతున్నాడు. అయినా ఏదో ఒక స్ట్రాటజీతో గేమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. తాజాగా జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ వల్ల శివాజీ చేయి నొప్పి మరింత పెరిగిపోయింది. దీంతో ఒకరు కాకుండా ఇద్దరు, మూడు డాక్టర్లను సంప్రదించి, తన చేయి పరిస్థితి గురించి అడిగామని బిగ్ బాస్.. శివాజీకి వివరించాడు. ప్రస్తుతం ఆ నొప్పి ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినా.. తర్వాత టాస్కులో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి హౌజ్‌లో కంటిన్యూ అవ్వాలనుకుంటే తన నొప్పి బాధ్యత తానే తీసుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. దీంతో ఉంటానని శివాజీ ప్రకటించాడు. ఆ తర్వాత కాసేపటికే వెళ్తానని మాట మార్చుకున్నాడు. ఇక నాగార్జున వచ్చిన తర్వాత నొప్పికంటే తాను ఏమీ ఆడలేకపోతాననే ఆలోచనే ఎక్కువ ఉందని వివరించాడు. అంతే కాకుండా బ్యాలెన్స్ కోల్పోతానేమో అని భయమేస్తుందని, ఇన్నిరోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఒక నెగిటివ్ అభిప్రాయంతో హౌజ్ నుండి వెళ్లిపోవడం తనకు ఇష్టం లేదని అన్నాడు. కానీ నాగార్జున మాత్రం ఆటపై ఫోకస్ చేయమని మోటివేట్ చేసి.. శివాజీ హౌజ్ నుండి వెళ్లిపోకుండా ఆపాడు.
మాటిచ్చి అనవసరం..
ఆ తర్వాత అమర్‌దీప్ కెప్టెన్సీ విషయంలో శివాజీ మాట మార్చిన విషయం గురించి తనను అందరి ముందు అడిగారు నాగార్జున. ‘‘మాటిస్తున్నాను అన్నావు. మాట కోసం చచ్చిపోతాను అన్నావు. ఎందుకు మాట మార్చావు’’ అని ప్రశ్నించారు. ‘‘మాటిచ్చాను కానీ ఆ సమయంలో నేను అమర్‌ను ఒక మాట అడిగాను. డిప్యూటీలుగా ఎవరిని పెట్టుకుంటావు అని. దానికి అమర్.. ప్రియాంక, శోభా అన్నాడు. సేఫ్ గేమ్ నడుస్తుంది అక్కడ మొత్తం. ఎప్పుడైతే డిప్యూటీలు వాళ్లే అని అన్నాడో అప్పుడే ఇంక వాడితో మాటలు అనవసరం, వాడికి మాటిచ్చి ఆలోచించడం అనవసరం’’ అని అమర్‌కు ఎందుకు సపోర్ట్ చేయలేదో బయటపెట్టాడు శివాజీ.
కరెక్ట్ కాదు..
డిప్యూటీలుగా వాళ్లని తీసుకుంటే ఏంటి సమస్య అని నాగార్జున అడిగారు. ‘‘న్యాయంగా బాలేదు. చాలా కారణాలు ఉన్నాయి. అవి చెప్పినా వాళ్లకు అర్థం కావు. నామినేషన్స్‌కు వాడుకుంటారు తప్పా ఆలోచించి మారే పరిస్థితి ఏం లేదు. వారు కూడా గేమే ఆడుతున్నారు. వాళ్లని అనే హక్కు కూడా నాకు లేదు’’ అని సమాధానమిచ్చాడు శివాజీ. తను కెప్టెన్‌గా ఉన్నప్పుడు డిప్యూటీలుగా యావర్‌ను, ప్రశాంత్‌ను తీసుకున్న విషయం గుర్తుచేయగా.. వాళ్లు బాగా హెల్ప్ అయ్యారని అన్నాడు. అమర్‌కు కూడా వాళ్లు అలాగే హెల్ప్ అవుతారేమో అని నాగార్జున చెప్పిన మాటకు శివాజీ ఒప్పుకోలేదు. ఈ ముగ్గురిని మూడు వారాల నుండి చూస్తున్నాను, కరెక్ట్ కాదు అన్నాడు. పనులు జరగడం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ మాట ప్రియాంకకు నచ్చలేదు. ఒక మాట మాట్లాడాలి అంటూ నిలబడింది.
అబద్ధాలు చెప్తున్నావు..
‘‘శోభా, అమర్ డిప్యూటీలు అయినప్పుడు కొంతమందికి బాలేకపోతే వీళ్లిద్దరూ వచ్చి పనులు చేశారు’’ అని ప్రియాంక చెప్తుంగానే.. శివాజీ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ‘‘ఏం లేదమ్మా. నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తున్నావు’’ అని అన్నాడు. ‘‘నువ్వు కాదు ఇది. సైలెంట్‌గా మాట్లాడవు. మర్యాదగా చేయించేకోవు. రావడం రావడమే సీరియస్‌గా వస్తుంది. నేను వద్దనే ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నాను. ఇంకొకరిని బాధపెట్టడం ఇష్టం లేదు. ఎప్పుడు ఎవరికైనా సీరియస్‌గానే చెప్తావు. వచ్చిన వారంలోనే చెప్పాను’’ అంటూ ప్రియాంకపై ఆరోపణలు చేశాడు శివాజీ. దీంతో ప్రియాంకను కూర్చోమన్నారు నాగార్జున. అబద్ధం చెప్తున్నానంటా అంటూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. అది కూడా పట్టించుకోకుండా ‘‘ఇలాంటివి చాలా చేస్తావు శనివారం రోజు’’ అని మరో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ సమయంలో శివాజీని సైలెంట్ చేయకుండా ప్రియాంకను మాత్రమే కూర్చోమని మరీ మరీ చెప్పారు నాగ్. అమర్‌దీప్ కూడా నాగార్జునతో మాట్లాడుతున్నప్పుడు తనపై కూడా అదే విధంగా సీరియస్ అయ్యాడు శివాజీ. దీంతో మరోసారి తన ప్రవర్తనతో ప్రేక్షకుల పట్ల నెగిటివ్‌గా మారిపోయాడు.
Also Read: వాడు మునగడు, నలుగురిని ముంచుతాడు - అమర్‌పై గౌతమ్ ఘాటు వ్యాఖ్యలు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply