బిగ్ బాస్ సీజన్ 7లో చాలారోజుల తర్వాత హౌజ్‌మేట్స్‌కు ఒక ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ముందుగా అందరికీ లంచ్‌ను ఏర్పాటు చేసి అదే సమయంలో గార్డెన్ ఏరియాలో ఒక మర్డర్ జరిగినట్టుగా సెటప్ ఏర్పాటు చేశారు. ఇక ఆ మర్డర్‌ కేసును చేధించే పోలీసులుగా అర్జున్, అమర్‌దీప్ వ్యవహరిస్తున్నారు. మిగతా హౌజ్‌మేట్స్‌ ఏయే పాత్రలు చేయాలో నేడు (నవంబర్ 22న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ వివరించారు. ఇక హౌజ్‌మేట్స్‌ అంతా తమ తమ పాత్రల్లో మునిగిపోయి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. మరోసారి శివాజీ.. తన స్ట్రాటజీలను ఉపయోగించి ప్రశాంత్‌ను ఆటాడించాడు.


ఒక్కొక్కరికీ ఒక్కొక్క పాత్ర..
బిగ్ బాస్ మర్డర్ టాస్కులో భాగంగా ప్రతీ ఒక్క హౌజ్‌మేట్‌ను విడివిడిగా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి వారి టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ముందుగా అమర్‌దీప్, అర్జున్‌లను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్ బాస్.. హంతకుడిని పట్టుకోకపోతే హౌజ్‌లో మరిన్ని హత్యలు జరుగుతాయని హెచ్చరించారు. అంతే కాకుండా హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి పోలీసులకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తర్వాత అశ్వినిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్ బాస్.. తను, శోభా కలిసి రిపోర్టర్లుగా వ్యవహరించాలని, కానీ వీరిద్దరూ.. విడివిడిగా ఎక్కువ వార్తలు సాధించడానికి పోటీపడాలని తెలిపారు. శివాజీని మ్యానేజర్‌గా, పల్లవి ప్రశాంత్‌ను చెఫ్‌గా, ప్రియాంక, యావర్‌లను బట్లర్లుగా, గౌతమ్ తోటమాలిగా, రతిక డ్రైవర్‌గా పాత్రలు చేయాలని బిగ్ బాస్ వివరించారు.


శివాజీనే హంతకుడు..
సీజన్ 7 ప్రారంభమయ్యి ఇన్ని రోజులు అయినా ఇప్పటివరకు అసలు ఎవరికీ సీక్రెట్ టాస్క్ ఇవ్వలేదు బిగ్ బాస్. కానీ ఇన్నిరోజులకు శివాజీకి సీక్రెట్ టాస్క్ ఆడే అవకాశం లభించింది. బిగ్ బాస్ మ్యాన్షన్‌కు శివాజీ మ్యానేజర్‌గా వ్యవహరిస్తూనే హత్యకు పాల్పడ్డాడని, తానే హంతకుడు అని బిగ్ బాస్ తెలిపారు. అంతే కాకుండా మిసెస్ బిగ్ బాస్ నెక్లెస్ కూడా తనకు అందజేశారు. సమయానుసారం హౌజ్‌లో ఏ కంటెస్టెంట్‌ను ఎలా హత్య చేయాలో శివాజీకి వివరించడం కోసం తనకు ఒక ఫోన్‌ను కూడా ఇచ్చారు. అయితే అందరికంటే ముందుగా పల్లవి ప్రశాంత్‌ను చంపమనే టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్.


దెయ్యంగా మారిన ప్రశాంత్..
పల్లవి ప్రశాంత్ పెంచుకునే మొక్కను పోస్ట్ బాక్స్‌లో పెడితే ప్రశాంత్‌ను హత్య చేసినట్టే అని ఫోన్‌లో శివాజీకి ఆదేశానిచ్చారు బిగ్ బాస్. అయితే మొక్కను పోస్ట్ బాక్స్‌లో పెట్టాలంటే ముందుగా ప్రశాంత్‌ను సైడ్ చేయాలనుకున్న శివాజీ.. తనను స్టోర్ రూమ్‌లో బంధించాడు. ఆ తర్వాత మెల్లగా తన మొక్కను తీసుకొని పోస్ట్ బాక్స్‌లో పెట్టేశాడు. చాలాసేపు ప్రశాంత్ ఏమైపోయాడో అని వెతికిన హౌజ్‌మేట్స్.. ఫైనల్‌గా తను స్టోర్ రూమ్‌లో ఉన్నాడని కనుక్కున్నారు. దీంతో ప్రశాంతే ముందుగా పోలీసుల దృష్టిలో అనుమానితుడు అయ్యాడు. కానీ శివాజీకి ఇచ్చిన టాస్క్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ప్రశాంత్ చనిపోయి దెయ్యంగా మారాడని బిగ్ బాస్ స్పష్టం చేశారు. అందుకే తను దెయ్యం డ్రెస్ వేసుకొని కేవలం లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాతే హౌజ్ లోపలికి రావాలని, మనుషులతో మాట్లాడకూడదని బిగ్ బాస్ తెలిపారు. మామూలుగా సీక్రెట్ టాస్క్ అంటే మిగతా హౌజ్‌మేట్స్‌కు తెలియకుండా ఆడాలి. కానీ శివాజీ మాత్రం బిగ్ బాస్ చెప్తేనే చేశానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని ప్రశాంత్‌తో చెప్పేశాడు.


Also Read: బిగ్ బాస్ హౌస్‌లో భర్తను చెప్పుతో కొట్టిన భార్య - వీడియో వైరల్