బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ సందడి మొదలయ్యింది. మొదటి కంటెస్టెంట్‌గా ఒక అందమైన అమ్మాయి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లింది. తనే ప్రియాంక జైన్. సీరియల్స్‌లో హీరోయిన్‌గా ఎంటర్ అయ్యి అందరినీ ఆకట్టుకున్న ప్రియాంక.. ఇప్పుడు బిగ్ బాస్ కోసం తన సీరియల్స్‌ను పక్కన పెట్టింది. ఇప్పటికే పలు రియాలిటీ షోలలో పాల్గొన్ని ప్రియాంకకు బుల్లితెర అనుభవం కూడా ఉంది. కానీ బిగ్ బాస్ అనేది ఇతర రియాలిటీ షోలతో పోలిస్తే చాగా భిన్నంగా ఉంటుంది. ‘పొట్టి పిల్ల’ పాటకు పర్ఫార్మెన్స్ చేస్తూ ఎంటర్ అయిన ప్రియాంక జైన్ స్మైల్‌కు అప్పుడే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అలాంటి హౌజ్‌లో ఈ అమ్మాయి ఎలా పర్ఫార్మ్ చేస్తుందా అని అప్పుడే బుల్లితెర ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు.
ముందుగా పవర్ అస్త్రా సాధిస్తేనే ఎవరైనా హౌజ్‌మేట్ అవుతారని, అప్పటివరకు కంటెస్టెంట్‌గానే ఉంటారని కొత్త విషయాన్ని చెప్పారు నాగార్జున. ఎలాగైనా హౌజ్‌మేట్ అవుతాను అన్న కాన్ఫిడెంట్‌తో లోపలికి వెళ్లింది ప్రియాంక. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఫస్ట్ డే ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైనా హౌజ్‌ను చూసి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంటారు. ప్రియాంక జైన్ కూడా అలాగే చాలా ఎగ్జైటెడ్‌గా ఫీల్ అయ్యింది. చెప్పులు లేకుండా ఎంటర్ అవ్వడం మంచి శకునం అంటూ ఎంటర్ అయ్యింది. హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం చూసింది. కానీ ఫర్నీచర్ ఏమీ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయింది. ఇంతలోనే నాగార్జున వచ్చి.. ఫర్నీచర్ కావాలంటే హౌజ్‌మేట్స్ సంపాదించుకోవాలని క్లారిటీ ఇచ్చారు. ప్రేక్షకుల కోసం బిగ్ బాస్ హౌజ్ టూర్ కూడా చేసింది ప్రియాంక. కానీ హౌజ్‌లో ఎక్కడ, ఏం ఉంది అని తెలియాంటే కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా సమయం పడుతుంది.
ఫర్నీచర్‌ను కంటెస్టెంట్సే సంపాదించుకోవాలి అనే అంశం బిగ్ బాస్ 7లోనే మొదటిసారి కనిపిస్తోంది. ఇంతకు ముందు సీజన్స్‌లో ఇలా ఎప్పుడూ జరగలేదు. ముందుగానే డైనింగ్ టేబుల్, సోఫా.. ఇలా అన్ని సౌకర్యాలతో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యేవారు కంటెస్టెంట్స్. ఫర్నీచర్ లేకుండా బిగ్ బాస్ హౌజ్‌ను చూసిన ప్రియాంక జైన్.. ఉల్టా పుల్టా సీజన్ అంటే ఇదేనా అంటూ నాగార్జునను ప్రశ్నించింది. ఇక ప్రియాంక హౌజ్ అంతా చూస్తున్న సమయంలోనే అసలు ఫర్నీచర్ ఉంటే హౌజ్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులకు చూపించారు నాగ్.
కాసేపు విరామం తర్వాత ప్రియాంక జైన్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తన ముందు ఒక సూట్‌కేస్‌ను పెట్టారు నాగార్జున. దానిని దాచిపెట్టే బాధ్యతను ప్రియాంకకు అందించారు. ఒకవేళ ఆ సూట్‌కేస్ దాచిపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరికైనా అది దొరికితే.. ఆ సూట్‌కేస్‌లోని పవర్స్ అన్నీ వారికి వెళ్లిపోతాయని చెప్పారు. ఎవరికీ ఆ పవర్స్‌ను దక్కనివ్వను అంటూ ప్రియాంక ఆ సూట్‌కేసును తీసుకుంది. జైలులోని బాత్‌రూమ్‌లో ఆ సూట్‌కేసును దాచిపెట్టి.. ఎవరికీ దొరకకూడదు అని కోరుకుంది. అయితే ఆ సూట్‌కేసులో డబ్బులు ఉన్నాయోమో అని ప్రేక్షకులు అప్పుడే అంచనా వేయడం మొదలుపెట్టేశారు. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత సూట్‌కేసులో ఏముందో తెలుస్తుందని అంచనా.