సోమవారం జరిగిన నామినేషన్స్‌పై హౌస్‌లో వాడీ వేడి చర్చ జరిగింది. నువ్వు నాలా మాట్లాడలేవంటూ ప్రియాంక అనడంపై అశ్వినీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భోలేతో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘ప్రియాంక ఏమైనా తోపా? మేమంతా ఉత్తినే బుస్సు కొట్టుకొనేవాళ్లం అనుకుంటుందా. కప్పు పట్టుకుని ఆమె ఒక్కరే పోతుందట. నువ్వు ఉన్నావనే బతుకుతున్నా భోలే’’ అని అశ్వినీ అంది. నామినేషన్స్‌లో రతిక, ప్రియాంక మధ్య టై అయ్యిందని, కెప్టెన్‌గా నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు శోభా శెట్టి తన ఫ్రెండ్ ప్రియాంకను సేవ్ చేసి, రతికను నామినేట్ చేసిందని తెలిపింది. 


నేనుంటే వారికి సినిమా కనిపిస్తుంది: శివాజీ


యావర్, రతికాలతో శివాజీ మాట్లాడుతూ.. ‘‘ఎవరు ఎవరికి ఫేవరెట్‌గా ఉంటారో ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. వాళ్ల టైమ్ బాగోలేక నేను ఇంట్లో ఉన్నానంటే వారికి సినిమా కనిపిస్తుంది. ప్రతి తప్పు బయట పడుతుంది’’ అని అన్నాడు. ఆ తర్వాత కెమేరా ముందుకు వచ్చి.. ‘‘2వ వారం నుంచే కొంతమంది కలిసి ఆడుతున్నారని అనిపించింది. ఈ వారం కరెక్టుగా దొరికారు. ఒక గ్రూపుగా దొరికారు. వాళ్లు ఎవరు నామినేషన్స్‌లో లేరు. రాత్రి నామినేషన్లు న్యాయంగా జరగలేదు. నేను కరెక్టు కాదు అనిపిస్తే ఎలిమినేట్ చెయ్యండి. నేను హౌస్‌లో ఉంటే దులిపేస్తా ఒక్కొక్కరిని’’ అని అన్నాడు.


కుటుంబ సభ్యుల రాకతో అంతా ఎమోషనల్


హౌస్‌మేట్స్ అందరికీ బీబీ కాలేజ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా స్టూడెంట్‌లా మారాలని బిగ్ బాస్ చెప్పాడు. ఒక్కొక్కరు టీచర్‌‌గా మారుతూ.. ఎంటర్‌టైన్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా బిగ్ బాస్.. శివాజీ పెద్ద కొడుకు గనీని డాక్టర్ వేషంలో హౌస్‌లోకి పంపాడు. హౌస్‌లోకి వచ్చిన గని.. తన తండ్రి ఆట తీరును కొనియాడాడు. అలాగే, హౌస్‌లో అందరినీ నమ్మొద్దని తెలిపాడు. పల్లవి ప్రశాంత్, యావర్ కాకుండా మిగతావారిని నమ్మొద్దు అంటూ.. సీరియల్ బ్యాచ్ గురించి పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ‘‘ఎవరు రెచ్చగొట్టినా స్పందించకు. మిగతా ఐదు వారాలు రెచ్చగొడతారు. ఎప్పుడూ ఎలా నవ్వి వదిలేస్తావో అలాగే వదిలేయ్. ఒక్కోసారి మాటలు జారుతున్నాయ్ జాగ్రత్త. మనం వాటిని ఊతపదాలు అనుకుంటాం. కానీ, బయటకు అలా అనిపించవు. వేరేవాళ్లు ఫీలవుతారు’’ అని తెలిపాడు. ‘‘వచ్చేటప్పుడు జనాలు క్లాప్స్ కొడతారు అంతే. నేను ఇలాగే ఉంటా.. ఇలాగే ఆడతా’’ అని అన్నాడు శివాజీ.


అర్జున్ భార్యకు సీమంతం


శివాజీ కొడుకు గని బయటకు వెళ్లిన తర్వాత అర్జున్ భార్య సురేఖా హౌస్‌లోకి వచ్చింది. ఆమె గర్భినీ కావడంతో బిగ్ బాస్ పూలు, పండ్లు పంపించి హౌస్‌మేట్స్‌తో సీమంతం చేయించాడు. దీంతో అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. ఆమెను చూసి ఏడ్చేశాడు. చెప్పాలంటే.. ఈ జంట చూసిన ప్రేక్షకుల కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత అశ్వినీ తల్లి హౌస్‌లోకి వచ్చారు. ఆమెను చూసి అశ్వీని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వెళ్తు వెళ్తూ.. హౌస్‌లో గౌతమ్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి మరీ వెళ్లారు.


Also Read: శోభా, ప్రియాంక కాళ్లకు మొక్కిన అశ్వినీ - తప్పుచేస్తే పీకేయండి అంటూ శివాజీ ఫైర్