బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ అనగానే కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటివరకు సీజన్ 7లో జరిగిన ప్రతీ టాస్క్.. పవర్ అస్త్రా గురించే. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి నాలుగు వారాలు అవ్వగా.. ఈ నాలుగు వారాల పాటు కంటస్టెంట్స్ మధ్య పవర్ అస్త్రా కోసం పోటీ తప్పా ఇంకేమీ జరగలేదు. దీంతో కెప్టెన్సీ టాస్క్ అనగానే ప్రేక్షకుల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. కెప్టెన్సీ కోసం పోటీ మొదలయ్యి ఒకరోజు పూర్తయ్యింది. ఇప్పటికే దీనికి సంబంధించి రెండు టాస్కులు పూర్తయ్యాయి. ఇక ఒకేరోజులో ముచ్చటగా మూడో టాస్క్ ఇచ్చి.. కంటెస్టెంట్స్‌కు నిద్ర లేకుండా చేశారు బిగ్ బాస్.


ఫ్రూట్ నింజా..
కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఇచ్చిన మూడో టాస్క్.. ‘ఫ్రూట్ నింజా’. ఈ టాస్కులో జంటలుగా ఉన్న కంటెస్టెంట్స్‌ను ఒక కంటెస్టెంట్స్ ఒకవైపు నుండి ఆరెంజ్‌లు విసురుతుంటే.. మరో కంటెస్టెంట్స్ మరోవైపు నిలబడి.. ఆ పండ్లను తమ తలపై ఉన్న బుట్టలో పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పండ్లను పక్కన ఉన్న బుట్టలో వేసుకొని, ఆపై ఏ వస్తువు ఉపయోగించకుండా కేవలం చేతులతోనే వాటిని పిండి.. రసాన్ని ఓ జార్‌లో నింపాలి. పండ్లను విసిరేవైపు గౌతమ్, అమర్‌దీప్, శివాజీ, శోభా శెట్టి, తేజ ఉండగా.. పండ్లను పట్టుకొని జ్యూస్ చేసేవైపు యావర్, ప్రియాంక, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, సందీప్ ఉన్నారు.


రెచ్చిపోయి ప్రోత్సహించారు..
పండ్లను విసురుతుంటే వాటిని బుట్టలో పట్టుకోవడం వరకు టాస్క్ అంతా ఈజీగానే అనిపించినా.. చేతితో జ్యూస్ పిండే క్రమంలో మాత్రం కంటెస్టెంట్స్ చాలా కష్టపడ్డారు. ఒకవైపు వారు కష్టపడుతుంటే.. మరోవైపు టీమ్‌మేట్స్ వారిని ప్రోత్సహించడం చాలా ఫన్నీగా అనిపించింది. అమర్‌దీప్, శివాజీ అయితే రెచ్చిపోయి మరీ..  పల్లవి ప్రశాంత్‌కు మోటివేషన్ ఇచ్చాడు. తొక్కల నుండి కూడా జ్యూస్ పిండండి అని అమర్‌దీప్ సలహా ఇవ్వగా.. తొక్కలను అలా ఎలా అందులో వేస్తారు అంటూ గౌతమ్ వాదించడం మొదలుపెట్టాడు. దీంతో అమర్ చెప్పినదానికి అర్థం అది కాదు అంటూ కంటెస్టెంట్స్.. గౌతమ్‌కు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు.


మొదటిసారి గెలిచిన తేజ, యావర్..
టాస్క్ పూర్తయ్యిన తర్వాత ఎవరెవరి జార్‌లో ఎంత జ్యూస్ ఉంది అనే విషయాన్ని బిగ్ బాస్‌కు చెప్పమని అమర్‌దీప్‌కు ఆదేశాలు వచ్చాయి. అమర్‌దీప్, సందీప్ జార్‌లో 3.8 మిల్లీలీటర్ల జ్యూస్ ఉంది. ప్రియాంక, శోభా శెట్టి జార్‌లో 2.3 మిల్లీలీటర్ల జ్యూస్ ఉంది. టేస్టీ తేజ, యావర్ జార్‌లో 4 మిల్లీలీటర్ల జ్యూస్ ఉంది. శుభశ్రీ, గౌతమ్ జార్‌లో 2.8 మిల్లీలీటర్ల జ్యూస్ ఉంది. పల్లవి ప్రశాంత్, శివాజీ జార్‌లో 3.7 మిల్లీలీటర్ల జ్యూస్ ఉంది. ఈ వివరాలను బిగ్ బాస్‌కు తెలిపాడు అమర్‌దీప్. అయితే అమర్‌దీప్ ప్రతీ జార్‌లో జ్యూస్ ఎంత ఉంది అని గమనిస్తున్న క్రమంలో వారి టీమ్‌లోని జార్‌లోనే తొక్క ఉందని, అందుకే అందులో జ్యూస్ ఎక్కువగా కనిపిస్తుందని పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. కానీ తన ఆరోపణలను ఎవరూ పట్టించుకోలేదు. తన టీమ్‌మేట్ అయిన శివాజీ కూడా పోనీలే వదిలేసేయ్ అని ప్రశాంత్ నోరుమూయించాడు. చివరిగా ఫ్రూట్ నింజా టాస్క్‌లో యావర్, తేజకు మూడు స్టార్లు దక్కాయి. రెండోస్థానంలో ఉన్న సందీప్, అమర్‌దీప్‌కు రెండు స్టార్లు, మూడోస్థానంలో ఉన్న ప్రశాంత్, శివాజీకి ఒక స్టార్ దక్కింది. దీంతో మూడు టాస్కుల్లో మొదటిసారి స్టార్ సాధించినందుకు యావర్.. సంతోషంలో మునిగిపోయాడు. పాపం, చోరీ టాస్కులో ‘బిగ్ బాస్’ చెప్పేది అర్థంకాక యావర్ ఏదేదో చేసేశాడు. కానీ, పండ్ల టాస్కులో మాత్రం బత్తాయిలను పిండేసి.. తన కండల సత్తా చాటాడు.


Also Read: నీకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు, అందుకే అలా చేస్తున్నావ్ - యావర్‌పై శివాజీ మండిపాటు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial