బిగ్ బాస్ మొదలయ్యి రెండురోజులు అవుతోంది. కానీ ఇప్పటికీ మొదటిరోజు జరిగిన నామినేషన్సే ప్రసారం అవుతున్నాయి. నిన్నటి (సెప్టెంబర్ 4న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో శివాజీ, ప్రియాంక జైన్.. తమ నామినేషన్స్‌ను పూర్తి చేసుకోగా.. దాని చుట్టూ పలు వాగ్వాదాలు జరిగాయి. ఇక మిగిలిన కంటెస్టెంట్స్.. నేడు (సెప్టెంబర్ 5న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ముందుగా శోభ శెట్టి, దామిని నామినేషన్స్‌తో ఫైర్ క్రియేట్ అయ్యింది హౌజ్2లో. దాని వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. అంతే కాకుండా ఈ నామినేషన్స్ కారణంగా గౌతమ్ కృష్ణ, శోభ శెట్టి మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది.


గౌతమ్‌తో బాండింగ్ లేదు..
ముందుగా శోభ శెట్టి నామినేషన్‌తో బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలయ్యింది. కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణను నామినేట్ చేసింది శోభా. కిరణ్ రాథోడ్‌కు భాష రావడం లేదని, దానివల్ల తను అందరితో కలవలేక, ఎవరూ తనతో కలవలేక ఇబ్బంది పడుతున్నారని కారణాలతో నామినేట్ చేసింది. దానికి కిరణ్ రాథోడ్ ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చుంది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ తనను మేడమ్ అని పిలిచాడని, అది తనకు వ్యంగ్యంగా అనిపించిందని చెప్పింది. అంతే కాకుండా హౌజ్‌లో ఉన్న అందరితో తనకు ఒక బాండింగ్ ఏర్పడుతుందని, గౌతమ్‌తో మాత్రం అలా లేదని, తను కనీసం కళ్లలో కళ్లు పెట్టి చూసి మాట్లాడడం లేదని చెప్పింది శోభా. ఈ కారణంగా గౌతమ్‌కు నచ్చలేదు.


మేడమ్ అనకూడదట..
శోభా శెట్టి నామినేషన్ రూమ్ నుండి బయటికి రాగానే తనతో ఈ విషయాన్ని క్లియర్ చేసుకోవాలని అనుకున్నాడు గౌతమ్ కృష్ణ. అందుకే శోభా గారు అంటూ తనను పలకరించాడు. అంత మర్యాద అవసరం లేదంటూ అప్పుడే గౌతమ్‌తో వ్యంగంగా మాట్లాడడం మొదలుపెట్టింది శోభా. ‘నేను మామూలుగా అందరినీ మేడమ్ అనే పిలుస్తాను. అది అసలు వ్యంగ్యంగా మాట్లాడింది కాదు. ఒకవేళ మీతో మాట్లాడకూడదు అనుకుంటే ఉదయాన్నే ఆమ్లెట్ చేసి ఇవ్వను కదా’ అన్నాడు గౌతమ్. ‘మీరు అందరినీ మామూలుగా అడుగుతూ నన్ను కూడా అడిగారు. ఆమ్లెట్ చేసి ఇచ్చారు కదా అని నామినేట్ చేయకుండా ఉండాలా’ అని ఎదురుప్రశ్న వేసింది శోభా. ఆ తర్వాత గౌతమ్.. తనకు ఏదీ వినడం ఇష్టం లేదు అన్నట్టుగా మోహం చాటేసింది. అది చూసి ‘నీకు వినాలని లేకపోతే నేను కూడా ఏమీ మాట్లాడను’ అంటూ కోపంగా వెళ్లిపోయింది శోభ. శోభతో మరోసారి ఆ సమస్యను క్లియర్ చేసుకోవడానికి వచ్చాడు గౌతమ్. అయినా అప్పుడు కూడా వాగ్వాదమే జరిగింది తప్పా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకలేదు.


అరిచింది.. ఆపై కన్నీళ్లు పెట్టుకుంది..
ఆ తర్వాత దామిని చేతిలో నామినేట్ అయ్యింది శోభా శెట్టి. అసలు శోభ కిచెన్‌లో ఏ పని చేయలేదని, కనీసం చేయాలా అని అడగలేదని, తిన్న ప్లేట్ కూడా కడగలేదని శోభపై ఆరోపణలు చేసింది శోభా. ఇది శోభకు అసలు నచ్చలేదు. టేస్టీ తేజ, సందీప్‌ను పిలిపించి తను ఉదయం నుండి కిచెన్‌లో ఏయే పనులు చేసిందో దామినితో చెప్పించింది. పనులు చేసినా చేయలేదు అనడం తప్పు అంటూ దామినిపై కోప్పడింది. దీంతో దామిని.. తనదే తప్పని ఒప్పుకుంది. దామినితో వాగ్వాదం తర్వాత గార్డెన్‌లో కూర్చున్న శోభ.. ‘పనులు చేసినా చేయడం లేదని అంటే ఎంత బాధగా ఉంటుంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.


Also Read: ఆ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్‌కు అదిరిపోయే రెమ్యునరేషన్ - బుల్లితెర సూపర్ స్టార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial