బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు సంబంధించి కొత్త ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఈ సీజన్‌కు సంబంధించిన ఒక చిన్న టీజ్‌ను కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్ల కంటే ఈ సీజన్ భిన్నంగా ఉండనుందనే హింట్‌ను ఇచ్చారు.


ఈ ప్రోమోలో నాగార్జున, ‘ఆరు సీజన్లు చూసేశాం. అంతా మనకు తెలుసు అనుకుంటారు కంటెస్టెంట్స్. పాపం పసివాళ్లు. మన ప్లాన్లు వాళ్లకు తెలీవు కదా. కొత్త రూల్స్, కొత్త ఛాలెంజ్‌లు. కొత్త బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా.’ అన్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న సెట్ కూడా తలకిందులు అవుతుంది.



'బిగ్ బాస్ తెలుగు' 7వ సీజన్ కు కింగ్ అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గతంలో నాలుగు సీజన్లకు హోస్ట్‌గా ఉన్న నాగ్ ఇప్పుడు లేటెస్ట్ సీజన్‌లోనూ సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘బిగ్ బాస్ గురించి మీకు తెలిసిందని మీరు అనుకున్నదంతా విప్లవాత్మకంగా మారబోతోంది! మీకు అత్యంత ఇష్టమైన నాగార్జునతో ఈ సీజన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?! గందరగోళంగా ఉందా? ఉత్సాహంగా ఉందా? Bigg Boss Telugu 7 గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి.’ అని 'స్టార్ మా' తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. 


బిగ్ బాస్ సీజన్ 7కు సంబంధించిన ప్రోమోలోకి వెళ్తే ఈసారి సీజన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడానికి నాగార్జున కాస్త ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో చూపించారు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదో' అని నాగ్ పాట పాడుతూ తనదైన శైలిలో చిటికె వేయడంతో, బ్యాగ్రౌండ్ లో ఉన్న వస్తువులన్నీ గాల్లోకి ఎగురుతున్నట్లు చూపించి ప్రోగ్రాంపై ఆసక్తిని రేకెత్తించారు. సెటప్ అంతా చూస్తుంటే ఈసారి సరికొత్త థీమ్ తో 'బిగ్ బాస్' సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 


నాగార్జున ఇప్పటి వరకు వచ్చిన ఆరు సీజన్లలో నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హెస్ట్‌లుగా వ్యవహరించారు.


ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కూడా నాగార్జుననే హోస్ట్. హౌస్‌లో కంటెస్టెంట్లను నాగార్జున డీల్ చేసే విధానం, వారితో వ్యవహరించే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే వీకెండ్ లో మంచి టీఆర్పీలు నమోదు అవుతుంటాయి. బిగ్ బాస్ 7వ సీజన్ కు నాగ్ హోస్టింగ్ చేయరని, సరికొత్త హోస్ట్ వచ్చే అవకాశం ఉందంటూ రూమర్స్ వచ్చాయి. కానీ నిర్వాహకులు మాత్రం ఈసారి కూడా కింగ్ వైపే మొగ్గు చూపారు. త్వరలో కంటెస్టెంట్స్ ఎంపిక, షో స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.