నార్త్ టు సౌత్ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అశిష్ విద్యార్థి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు పలు సినీ పరిశ్రమల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాకు మూడు ముళ్లు వేశారు. మే 25న తమ సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు కోర్టులో వివాహం చేసుకున్నారు.
ఆమె నుంచి విడిపోవడం బాధ కలిగించింది
తాజాగా తన మొదటి భార్య పీలూ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. తన మాజీ భార్య పిలూ నుంచి విడిపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆమెతో విడాకుల నిర్ణయం అంత తేలికగా జరగలేదన్నారు. విడాకులు నిర్ణయం రాత్రికి రాత్రి జరిగింది కాదన్నారు. “నేను ఆమెను ద్వేషించలేను. పిలూ, నేను చాలా కాలం చక్కటి వివాహ బంధాన్ని కొనసాగించాం. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పిలూను ఎప్పుడూ ఓ ఫ్రెండ్ గానే చూశాను. ఆమెతో విడిపోవడం చాలా బాధను కలిగిస్తోంది. ఆమెను, నా కొడుకు మోగ్లీని వదులుకోవడం చాలా కష్టం అనిపించింది” అని చెప్పుకొచ్చారు.
స్నేహపూర్వకంగానే విడిపోయాం
“మనలో ప్రతి ఒక్కరూ వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చారు. భిన్నమైన నమ్మకాలు, మతాలు ఉన్నాయి. అయితే, మనందరికీ ఉమ్మడిగా ఒక విషయం ఉంది. మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. 22 ఏళ్ల క్రితం, నాకు పెళ్లయింది. అద్భుతంగా గడిచింది. కొంత కాలంగా మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరి దారులు వేరని భావించాం. వాటిని విస్మరించి కలిసి ఉండాలి అనుకున్నాం. అందుకోసం కొంత ప్రయత్నం కూడా చేశాం. కానీ, కుదరలేదు. మేము కూర్చుని, స్నేహపూర్వకంగా వేర్వేరు మార్గాల్లో నడవడం గురించి ఆలోచించాం. చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే విడిపోయాం” అని ఆశిష్ ఆ వీడియోలో చెప్పారు.
రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పిన ఆశిష్ విద్యార్థి
తాజాగా తన రెండో పెళ్లి గురించి పలు విషయాలు వెల్లడించారు ఆశిష్ విద్యార్థి. అసలు తాను రెండో వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పారు. ఆశిష్ పెళ్లి తర్వాత పలు విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆశిష్ వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న తన మొదటి భార్య, ఆయనకు దూరంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, రూపాలిని తాను ఎలా కలిశాడో చెప్తూ ఆశిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఓ వీడియోను పోస్టు చేశారు. రూపాలికి ఇప్పటికే పెళ్లై భర్తను కోల్పోయిందని వివరించారు. “నేను ఎవరో ఒకరితో ప్రయాణం చేయాలనుకున్నాను. అలా అనుకుంటున్న నాకు ఏడాది క్రితం రూపాలి బారువా కలిసింది. మేము భార్యాభర్తలుగా జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నాం. అందులో భాగంగానే పెళ్లి చేసుకున్నాం” అని వివరించారు.