Bigg Boss 6 Telugu: ఆరోహి... ఈ పేరు మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెను చూసి పోలుస్తారేమో కానీ, పేరును మాత్రం గుర్తుపెట్టుకోరు. కానీ ఇప్పుడు ఈమె బిగ్ బాస్‌లో సందడి చేస్తోంది. అంతేకాదు అవసరం అయిన చోట తన గొంతును వినిపిస్తోంది. బిగ్‌బాస్ ఇంట్లో... గుంపులో గోవిందంలా కలిసిపోవడం కన్నా, తమ ఉనికిని కాపాడుకోవడమే నిజమైన టాస్క్. ఆ విషయంలో ఆరోహి మొదటి వారమే విజయవంతమైంది. కానీ మొదటి వారమే నామినేషన్లో ఉండి, ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకుంది. వయసులో చిన్నపిల్లే అయినా ఇతర సీనియర్ కంటెస్టెంట్లకి గట్టిపోటీనే ఇస్తోంది. ఇక ఆమె నిజజీవిత కథ మాత్రం కన్నీరు తెప్పించేలా ఉంది.
కూలి పని చేసుకుని...
ఆరోహి బిగ్‌బాస్ కి రావడానికి కొన్ని రోజుల ముందే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్య్వూ ఇచ్చి వచ్చింది. ఇప్పుడు అవి ట్రెండవుతున్నాయి. అందులో ఆమె వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఆమెకు అయిదేళ్ల వయసులోపే తల్లి చనిపోయింది. తండ్రి వేరే పెళ్లి చేసుకుని ఆరోహిని, ఆమె అన్నను వదిలి వెళ్లిపోయాడు. దీంతో అమ్మమ్మ చేరదీసింది. అన్నను హాస్టల్లో వేయడంతో అన్నాచెల్లెళ్ల మధ్య బంధం కూడా సరిగా లేదు. ఈమె అసలు పేరు అంజలి. యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చాక ఆరోహిగా పేరు మార్చుకుంది. ఆమె స్కూలు చదువుతూ కూలి పనులకు కూడా వెళ్లిందట. పత్తి ఏరడానికి, మిరప చేనులోని పనికి వెళ్లింది. ఆ డబ్బులను చదువుకు ఉపయోగించింది. అమ్మమ్మ వాళ్లింట్లో ఉండే తన చదువును పూర్తి చేసింది. డిగ్రీ చదువుతున్నప్పుడు వరంగల్ లోకల్ ఛానెల్ లో పనిచేసింది. నాలుగు వేలు జీతం వచ్చేది. షార్ట్ ఫిల్మ్‌కు డబ్బింగ్‌లు చెప్పడం, చిన్న చిన్న పాత్రల్లో నటించడం వంటివి చేసేది. వాటికి చాలా తక్కువ వచ్చినా,చదువు కోసం కంటిన్యూ చేసింది. ఎంబీఏ చదువును మధ్యలో వదిలేసి యాంకర్ గా అడుగుపెట్టింది.
బ్రేకప్ అయ్యింది
అందరిలాగే తనకు కుటుంబం ఉంటే బావుంటుందని చాలాసార్లు అనిపిస్తుందని చెప్పింది ఆరోహి. తాను ఒకబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయి కూడా ప్రేమించాడు కానీ పెళ్లి పీటలు ఎక్కలేదని వివరించింది. దానిక్కారణం ఆరోహికి కుటుంబం లేకపోవడమే. ఆ పిల్లాడికి పెద్ద కుటుంబం ఉంది, కానీ ఆరోహికి లేదు. అదే బ్రేకప్‌కు కారణం అయ్యింది. ఫ్యామిలీ లేని అమ్మాయి వద్దంటూ అబ్బాయి తరుపు వారు నో చెప్పేశారు. కుటుంబం లేకపోవడమే తనకు పెద్ద సమస్యగా మారిపోయింది. కనీసం ఒక అబ్బాయిని ప్రేమించినా కూడా పెళ్లి చేయమని అడగడానికి ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేరని బాధపడుతూ చెబుతోంది ఆరోహి. ప్రస్తుతం ఎలాంటి లవ్ స్టోరీలు లేవంట. ఫ్యామిలీ లేని సింగిల్ ఉమెన్ ని చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు అని, ఆస్తి,కుటుంబం లేని అమ్మాయిని ఎవరూ ఒప్పుకోరని తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. అందుకే తాను పెద్దగా ప్రేమ, పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించలేదని చెబుతోంది.
అలవాటైపోయింది...
పాతికేళ్లుగా ఒంటరిగా బతకడం అలవాటైపోయింది ఆరోహికి. సమస్యలను అధిగమించడం, బాధలను భరించడం అన్నీ ఆమెకు ఆమెనే నేర్చుకుంది. ఇప్పుడు కూడా భవిష్యత్తులో జీవిత భాగస్వామి వచ్చినా అతనిలో అన్ని బాధలు షేర్ చేసుకుంటానో లేదో తెలియదని అంటోంది. ఇప్పుడు కూడా సమస్య వచ్చినా ఎవరితోనూ షేర్ చేసుకోనని తానే ఎదుర్కొంటానని అంటోంది. పాతికేళ్ల ఒంటరితనం తనకు నేర్పిన పాఠం అదేనని చెప్పుకొచ్చింది.
Also read: సిసింద్రీ టాస్క్‌లో రేవంత్ గెలవకుండా అడ్డుకున్న ఫైమా, ఫైర్ అయిన రేవంత్