'ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ గనుక లేకుంటే జనవరి 7న ఈ సినిమా రిలీజ్ అయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మార్చి 25న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
చరిత్రలో కలవని ఇద్దరు యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలుసుకొని.. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ఎన్ని సార్లు చెప్పినప్పటికీ.. ఆ పాయింట్ నే పట్టుకొని వివాదాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ కొందరు కోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు ఈ సినిమాకి మరో సమస్య వచ్చింది.
'ఆర్ఆర్ఆర్' సినిమాతో పోరాట వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఏపీ సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నిస్వార్ధంగా పోరాడిన వీరులను రాజమౌళి డబ్బుల కోసం వాడుకుంటున్నారని అన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారి దగ్గర పోలీస్ ఆఫీసర్ గా పనిచేసినట్లు, అమ్మాయితో డాన్స్ చేసినట్లు చూపించారని మండిపడ్డారు.
ముందుగా చరిత్రకారులకు, భీమ్, అల్లూరి కుటుంబసభ్యులకు సినిమా చూపించి అసభ్యకరమైన సన్నివేశాలను తొలగించాలని చెప్పారు. సినిమాను సినిమాగానే చూడాలన్నప్పుడు.. దేశం కోసం ప్రాణాలను వదిలిన అమర వీరుల పేర్లను వాడుకోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని.. హైదరాబాద్, ఢిల్లీలోని సెంట్రల్ సెన్సార్ బోర్డు దగ్గర దీక్షలు చేపడతామని అన్నారు. మరి దీనిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి!
ఇక డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు.