బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.65 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది ఈ సినిమా. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.


అయితే ఈ సినిమాను బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ కూడా ప్రమోట్ చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి నిజాలను బాలీవుడ్ స్టార్స్ యాక్సెప్ట్ చేయలేరంటూ కామెంట్స్ చేశారు. ఏ సినిమా అయినా.. విడుదలవుతుందంటే కచ్చితంగా 'ది కపిల్ శర్మ' కామెడీ షోలో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది 'ది కశ్మీర్ ఫైల్స్' టీమ్ ఈ షోలో కనిపించలేదు. 


దీంతో కపిల్ శర్మపై మండిపడ్డారు అభిమానులు. కావాలనే అతడు కశ్మీర్ ఫైల్స్ టీమ్ ని పిలవలేదని.. అతడు ఖాన్స్ కి మాత్రమే ఫేవరబుల్ గా ఉంటాడంటూ ఓ రేంజ్ లో ఏకిపారేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కపిల్ శర్మ తన ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో అనుపమ్ ఖేర్.. కపిల్ శర్మ షో గురించి మాట్లాడుతూ కనిపించారు. నిజానికి కపిల్ శర్మ షో నుంచి తనకు కాల్ వచ్చిందని.. కానీ 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా సీరియస్ కథ కావడంతో కామెడీ షోకి వెళ్లడం కరెక్ట్ కాదనిపించింది అని చెప్పారు. 


ఈ వీడియోను షేర్ చేసిన కపిల్ శర్మ.. 'థాంక్యూ అనుపమ్ గారు.. నా మీద వస్తోన్న ఆరోపణలు అబద్ధమని నిరూపించారు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అనుపమ్ ఖేర్.. 'మీరు పూర్తి వీడియోను పోస్ట్ చేసి ఉంటే బాగుండేది.. సగం నిజం కాదు. ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోంది, మీరు కూడా సంబరాలు జరుపుకోండి' అంటూ బదులిచ్చారు.


అనుపమ్ తన ట్వీట్ లో కపిల్ శర్మ సగం నిజాన్ని మాత్రమే చెప్పారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు పూర్తి వీడియోను షేర్ చేస్తున్నారు. అందులో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. కపిల్ శర్మ షోకి వెళ్లకపోవడానికి కారణం తన ప్రొడ్యూసర్లు వేరే చెప్పారంటూ కామెంట్స్ చేశారు.