'ANR 100' Film Festival: తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్నో అద్భుత చిత్రాల్లో అసమాన నటనతో నటసామ్రాట్ గా పేరు సంపాదించుకున్నారు. సెప్టెంబర్ 20న ఆ మహనీయుడి 100వ జయంతి జరగనుంది. ఈ సందర్భంగా ఇండియన్ సినీ లెజెండ్ కు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఘన నివాళి సమర్పించబోతోంది. 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఈ చిత్ర వేడుక హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తో పాటు 25 నగరాల్లో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు అక్కినేని క్లాసిక్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీతో పాటు NFDC(నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా) PVR-Inox సహకారంతో దేశవ్యాప్తంగా ఈ వేడుక నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్ ను బిగ్ బీ అమితాబ్ రిలీజ్ చేశారు.
ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించే సినిమాలివే!
ఇక ఈ ఫిలిం ఫెస్టివల్ లో అక్కినేని ల్యాండ్ మార్క్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) చిత్రాలను ప్రదర్శించనున్నారు.
సంతోషంగా ఉంది- అక్కినేని నాగార్జున
తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం పట్ల అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. “ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ నాన్నగారి 100వ జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆయన ఎన్నో అద్భుత పాత్రలు పోషించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే ఆయనను ప్రేక్షకులు నటసామ్రాట్ అని పిలుస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గదర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం సంతోషంగా ఉంది” అని వెల్లడించారు.
ఏఎన్నార్ లెగేసీని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది- అమితాబ్
అక్కినేని 100వ జయంతి సందర్భంగా ఆయన లెగెసీని సెలెబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. “తెలుగు చలనచిత్ర పరిశ్రమ మార్గ దర్శకుడు, భారతీయ సినిమాకు ఐకాన్ అయిన అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా... ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహించడం సంతోషంగా ఉంది. అక్కినేని లెగేసీని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అతడిని ఎన్నోసార్లు కలిసి అదృష్టం కలిగింది. ఆయన వినయం, సింప్లీసిటీ చూసి ఆశ్చర్యపోయాను. ‘దేవదాసు’, ‘సుడి గుండాలు’, ‘డాక్టర్ చక్రవర్తి’ లాంటితెలుగు క్లాసిక్‌లలో లెజెండరీ నటుడి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్ పీరియన్స్ చేసే అద్భుత అవకాశాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది” అని బిగ్ బీ అన్నారు.
250 చిత్రాల్లో నటించిన అక్కినేని
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 71 సంవత్సరాల కెరీర్ లో 250పైగా సినిమాలు చేశారు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులను అందుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. జనవరి 22, 2014లో అక్కినేని అనారోగ్యంతో చనిపోయారు.