Jai Hanuman Movie Update: తెలుగు సినిమా పరిశ్రమలో 'హనుమాన్' సంచలనం సృష్టించింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీసు దగ్గర ధూంధాం చేసింది. తక్కువ అంచనాలతో చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో రికార్డుల మోత మోగించింది. చిన్న హీరో, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా విడుదలైన నెలన్నర వరకు  థియేటర్లలు చక్కటి ఆక్యుపెన్సీతో రన్ అయ్యాయి.  తెలుగుతోపాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లోనూ ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.     


త్వరలో ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్


ఇక ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎండ్ కార్డులోనే వెల్లడించారు. ‘జై హనుమాన్’ పేరుతో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కబోతోందని చెప్పారు. తాజాగా ‘జై హనుమాన్’ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇప్పుటికే ఈ సినిమా పనులు మొదలయ్యాయని చెప్పిన ఆయన, త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.  “ఇప్పటికే ‘జై హనుమాన్’ సినిమా పనులు మొదలయ్యాయి. అతి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయబోతున్నాం. ఇందులో హనుమంతులవారే హీరో. ‘హనుమాన్’ క్లైమాక్స్ ఎలా నచ్చిందో, సీక్వెల్ మొత్తం అలాగే ఉండబోతోంది. మీరు ఇచ్చిన సక్సెస్ ను నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. మీ రుణాన్ని ‘జై హనుమాన్’తో తీర్చుకోబోతున్నాను” అని చెప్పుకొచ్చారు.






ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం  


నిజానికి ఇటీవల విడుదలైన సినిమాలు మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం ఇంచుమించు ఇంతే సమయంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ‘హనుమాన్’ మూవీ మాత్రం ఇప్పటికీ ఓటీటీలోకి అడుగు పెట్టలేదు.  ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది.   మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, అప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ కావడంతో మార్చికి వాయిదా వేశారు.  మార్చి 1న లేదంటే 2న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, మార్చి 8న మహాశివరాత్రి, మహిళా దినోత్సవం కావడంతో ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  


‘హనుమాన్‌’ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు.  అంజనాద్రి అనే ఊహాజనిత గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఓ సాధారణ యువకుడికి  ఆంజనేయుడి ద్వారా పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపించారు. 


Read Also: అల్లరి నరేష్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్ షురూ - ఫస్ట్ సింగిల్ రెడీ