యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ 'ఆర్ఆర్ఆర్'లో నటించారు. అయితే... జంటగా కాదు. అందులో రామ్ చరణ్ జోడీగా, సీత పాత్రలో ఆలియా భట్ కనిపించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ చేయనున్న సినిమాలో ఆయనకు జోడీగా ఆమె నటించనున్నారనేది తెలిసిన విషయమే. హీరోగా ఎన్టీఆర్ 30వ చిత్రమిది. అందుకని NTR30 గా వ్యవహరిస్తున్నారు.


ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించనున్న తాజా సినిమాలో ఆలియా భ‌ట్‌ కథానాయిక. ఆల్రెడీ ఆమెకు దర్శకుడు కథ వివరించారు. సినిమా గురించి మాట్లాడారు. అయితే... ఆలియా భట్ ఇంకా ఈ సినిమాను కన్ఫర్మ్ చేయలేదు. కానీ, ఎన్టీఆర్ 30లో నటించడం దాదాపు ఖాయమని అన్నట్టు చెప్పారు.


ముంబైలో జరిగిన 'గంగూబాయి కతియావాడి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ సినిమా గురించి ఆలియాను ప్రశ్నించగా... "ఎన్టీఆర్ 30 కోసం నన్ను సంప్రదించారు. నేను కొరటాల శివ గారితో మాట్లాడుతున్నాను. ఆయన ఇప్పటి వరకూ చాలా మంచి సినిమాలు తీశారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 గురించి నేను ఏమీ కామెంట్ చేయదలచుకోలేదు. అయితే... మా కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాను. నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారు, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ గారు తీసిన 'ఆచార్య' కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని చెప్పారు. అదీ సంగతి!


ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ కథను రెడీ చేసినట్టు తెలిసింది. 


ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్‌ లీడ‌ర్‌గా కనిపించనున్నారు. ఇంపార్టెంట్ మేటర్ ఏంటంటే... బస్తీలో చదువుకునే పేద విద్యార్థుల హక్కుల కోసం, ఆ పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేసే నాయకుడిగా ఆయన కనిపించనున్నారని తెలిసింది. ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకుడు ఎలా ఢీ కొన్నాడు? అనేది కథ (NTR30 Story Line). రాజకీయాలు, రాజకీయ నాయకులతో ఓ విద్యార్థి చేసే పోరాటం మీద సినిమా ఉంటుందని సమాచారం.


ఆలియా భట్ టైటిల్ పాత్రలో నటించిన 'గంగూబాయి కతియావాడి' సినిమాకు వస్తే... అందులో వేశ్యగా ఆమె కనిపించనున్నారు. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కూడా నటించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.