గతకొంత కాలంగా బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్  ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. తాజాగా జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ కార్యకర్తలు సినిమాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని సూచించారు. అలాంటి వారు పార్టీ అభివృద్ధి అజెండాకు వెన్నుపోటు పొడుస్తున్నట్లేనని వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  


ప్రధాని మోదీ మాటలతో ఇండస్ట్రీకి మేలు- అక్షయ్ కుమార్


ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపించారు. ప్రధాని భారతదేశంలో అతిపెద్ద ప్రభావశీలిగా అభివర్ణించారు. ఆయన మాటలు కొంత మార్పును తీసుకురాగలిగితే, అది చిత్ర పరిశ్రమకు ఎంతో గొప్ప మేలు చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. "పాజిటివిటీకి ఎప్పుడూ స్వాగతం ఉంటుంది. ప్రధాని సైతం తమ కార్యకర్తలకు సినిమాల గురించి హితబోధ చేయడం సంతోషకరం. ఆయన భారతదేశపు అతిపెద్ద ప్రభావశీలి. ఆయన సినిమాల గురించి మాట్లాడే ప్రతి మాట ఇండస్ట్రీకి మేలే చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారాలి. ఎందుకంటే మనం చాలా కష్టపడి సినిమాలు చేస్తాం. సెన్సార్ బోర్డుకు వెళ్తాం.  వాటిని పాస్ చేయిస్తాం.  ఆపై ఎవరో ఏదో చెబుతారు. అది వివాదం అవుతుంది. కానీ, ఇప్పుడు ప్రధాని స్వయంగా చెప్పారు. ఆయన మాటలు సినిమా పరిశ్రమకు మంచి చేయబోతున్నాయని భావిస్తున్నాను” అని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.   






మలయాళ బ్లాక్‌బస్టర్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ ‘సెల్ఫీ’


ప్రస్తుతం అక్షయ్ కుమార్ రాజ్ మెహతా దర్శకత్వం వహించిన  ‘సెల్ఫీ’ సినిమాలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు నటించిన 2019 మలయాళ బ్లాక్‌బస్టర్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో డయానా పెంటీ, నుష్రత్ భరుచ్చా కూడా నటిస్తున్నారు.  దీనిని ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.   


అక్షయ్ తో పని చేయడం సంతోషంగా ఉందన్న ఇమ్రాన్ హష్మీ


2014లో తన కుమారుడి క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తనకు సహాయం అందించిన మొదటి సెలబ్రిటీ అక్షయ్ కుమార్ అని ఇమ్రాన్ హష్మీ వెల్లడించారు. అందుకే ఆయనతో కలిసి పనిచేయడం పట్ల సంతోషిస్తున్నానన్నారు. “ఒక హీరోనా? ఇద్దరు హీరోలా? అనేది ముఖ్యం కాదు. నాకు మంచి కంటెంట్ మాత్రమే ముఖ్యం'' అని హష్మీ అన్నారు. ఫిబ్రవరి 24న ‘సెల్ఫీ’ థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా  ‘సెల్ఫీ’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ముంబైలో జరిగింది.






Read Also: షారుఖ్ ‘పఠాన్’కు అరుదైన గుర్తింపు, ఆ ఫార్మాట్ లో విడుదల కాబోతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే!