బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు హీరో అక్షయ్ కుమార్. అలాగే పాత్రలను ఎంచుకునే విషయంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఇటీవల నటించిన ‘బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వి రాజ్, రక్షా బంధన్, కట్ పుట్లీ, రామ్ సేతు’ వంటి సినిమాలు విడుదల అయ్యాయి. తాజాగా ఆయన మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహావీరుడు చత్రపతి శివాజీ మహరాజ్ జీవితం ఆధారంగా మరాఠీ లో తెరకెక్కనున్న ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ సినిమాలో అక్షయ్ శివాజీ పాత్ర లో కనిపించనున్నాడు.
ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు అక్షయ్. ఆ పోస్ట్ లో ఆయన ఇలా రాసుకొచ్చాడు. ‘ఈ రోజు మరాఠీ చిత్రం 'వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్' చిత్రీకరణను ప్రారంభిస్తున్నాను, ఇందులో నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ పాత్ర పోషించడం నా అదృష్టం. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఆశీర్వదించండి’ అని రాశాడు. అయితే ఈ పోస్ట్ విడుదల చేసిన కొద్ది సేపటికే అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ట్రోలింగ్ ప్రారంభించారు.
శివాజీ పాత్రలో అక్షయ్ నటించడానికి వీల్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సినిమా గురించి విడుదల చేసిన వీడియోలోనూ తప్పులున్నాయంటూ మండిపడుతున్నారు. శివాజీ మహరాజ్ 1674 నుంచి 1680 వరకు పాలించారు. థామస్ ఎడిసన్ 1880 లో లైట్ బల్బును కనుగొన్నారు. మరి ఆ వీడియో బ్యాగ్రౌండ్ లో లైట్లు ఎలా వచ్చాయంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అలాగే మరొక వ్యక్తి స్పందిస్తూ.. శివాజీ మహారాజ్ 50 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అక్షయ్ వయస్సు 55. శివాజీ పాత్ర పోషించడానికి మరాఠీలో మంచి నటుడే దొరకలేదా అంటూ విమర్శించాడు. ఇలా చాలామంది నెటిజన్స్ అక్షయ్ కుమార్ శివాజీ పాత్రపై ట్రోలింగ్ చేస్తున్నారు.
వాస్తవానికి అక్షయ్ పై నెటిజన్స్ ఆ స్థాయిలో విమర్శలు చేయడం వెనుకా ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఈ ఏడాది జూన్ 3 న విడుదలైన అక్షయ్ ‘పృథ్వీరాజ్ చౌహాన్' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. భారత దేశం గర్వించ దిగిన నాటి రాజులలో పృథ్వీరాజ్ చౌహాన్ ఒకరు. అలాంటి పృథ్వీరాజ్ పాత్రను అక్షయ్ చెడగొట్టాడండూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు శివాజీ పాత్రను కూడా అలాగే చెడగొడతాడు అంటూ కొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది చాలా సినిమాలు విడుదల చేశాడు. అలాగే ‘హేరా ఫెరి-3’ లో నటిస్తున్నాడు. ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో జే దుధానే, ఉత్కర్ష షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య,, నవాబ్ ఖాన్, ప్రవీణ్ టార్డే తదితరులు నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మరాఠీ, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.