అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా, సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ (Agent) ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ కారణంగా థియేటర్లలో ఈ సినిమా చూడని ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ (Agent OTT Release Date) కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఐదు నెలల తర్వాత ఏజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. సెప్టెంబర్ 29వ తేదీన ‘ఏజెంట్’ను స్ట్రీమ్ చేయనున్నట్లు సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది.






ఇటీవలి కాలంలో ఎక్కువ వివాదాస్పదంగా నిలిచిన సినిమా కూడా ‘ఏజెంట్’నే. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించాడు నిర్మాత అనిల్ సుంకర. ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్ అయినా నాన్ థియేట్రికల్ రైట్స్‌తో అయినా జరిగిన నష్టాన్ని కవర్ చేద్దామని ట్రై చేశాడు. కానీ ఆ ప్లాన్ కూడా వర్కవుట్ అవ్వలేదు. థియేటర్లలో భారీ డిజాస్టర్‌గా నిలవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఈ నష్టాన్ని ఎలా కవర్ చేయాలని అయోమయంలో పడ్డారు.


చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఒక కీలకమైన డిస్ట్రిబ్యూటర్ మాత్రం ఈ విషయంపై కోర్టుకెక్కాడు. తమకు కలిగిన నష్టానికి నిర్మాత అనిల్ సుంకర పూర్తి బాధత్య వహించాలని డిమాండ్ చేస్తున్నాడు. ‘ఏజెంట్’ కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడు అనేది సినిమా చూస్తే అర్థమవుతోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కావడంతో తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో అఖిల్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. మమ్ముట్టి లాంటి మలయాళ సూపర్‌స్టార్‌ను తెలుగులోకి తీసుకొచ్చారు. కానీ ఇవేవి ‘ఏజెంట్‌’ను డిజాస్టర్ కాకుండా కాపాడలేకపోయాయి.


‘ఏజెంట్’ విడుదల అయి నెగిటివ్ టాక్ అందుకోగానే తప్పు తనదేనంటూ నిర్మాత అనిల్ సుంకర ఒక ప్రకటనను విడుదల చేశారు. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ లేకుండా సినిమాను ప్రారంభించామని ఓపెన్‌గా తెలిపాడు. దీంతో అక్కినేని అభిమానులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా అతని ఫైర్ అయ్యారు. స్క్రిప్ట్ రెడీ అవ్వకుండా కేవలం ఒక యాక్షన్ సినిమా మీద అంత బడ్జెట్‌ను పెట్టడం మూర్ఖత్వం అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.


స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి... హీరో అఖిల్‌ను మరింత స్టైలిష్‌గా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమే ‘ఏజెంట్’. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ‘ఏజెంట్’ తెరకెక్కింది. టీమ్ అంతా సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ప్రమోషన్స్ కూడా చేసింది. విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షో నుండే సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ దగ్గర నుంచే ‘ఏజెంట్’పై దెబ్బపడింది. నిర్మాతలు బడ్జెట్‌ను ఎప్పుడూ సరిగ్గా లెక్కించాలి. కాస్త అటు, ఇటు అయినా కూడా వారిపై పడే ఆర్థిక భారం కొన్నేళ్లు అయినా తీర్చలేనిదిగా మారిపోతుంది.