ఇండియన్ ఐడల్ కార్యక్రమం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న శ్రీరాం చంద్ర ఈ షోలో విన్నర్‌గా నిలిచాడు. తనతో పాటు రేవంత్ పాటు విజేతగా నిలవగా, ఈ సంవత్సరం జరిగిన ఇండియన్ ఐడల్‌లో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఐదో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ లైగర్ పాట పాడే అవకాశం కూడా షణ్ముఖ ప్రియ సంపాదించింది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటించారు.


దీనికి సంబంధించిన తెలుగు వెర్షన్ ‘తెలుగు ఇండియన్ ఐడల్’ను ప్రారంభిస్తున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన రేవంత్ ఈ షోకి హోస్ట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆహాలో ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ మంచి ఆదరణ పొందింది.


ఆహా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా టాక్‌ షోలతో డిజిటల్‌ వ్యూవర్స్‌కి సరికొత్త అనుభూతిని పంచేందుకు వివిధ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆరంభంలోనే ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ సమంత సామ్‌ జామ్‌ టాక్‌ షో నిర్వహించి టాలీవుడ్‌ బిగ్‌ సెలబ్రెటీలతో సందడి చేయించింది.


హిందీలో 12 సీజన్లు కంప్లీట్‌ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులో లేదు. తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆడిషన్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు ఆహా నిర్వహకులు. డిసెంబర్‌ 26వ తేదీన తొలి ఆడిషన్స్‌ జరగనున్నాయి. ఇందుకోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీ గాయకులకు ఆహ్వానం అందించారు. ఈ ఆడిషన్స్‌ హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌లో నిర్వహించనున్నారు.