Abdul Razzaq Apology: పాకిస్తాన్ క్రికెటర్లు తరచుగా భారత్ పైనా, భారత క్రికెట్ జట్టుపైనా తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. సందర్భం ఏదైనా ఇండియాను ఎలా బ్లేమ్ చేయాలా? అని చూస్తుంటారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అసందర్భంగా ఆమెపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం పట్ల భారతీయుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన  క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.


ఇంతకీ ఆయన ఐశ్వర్య గురించి ఏమన్నాడంటే?


తాజాగా ఓ పాకిస్తాన్ ఛానెల్ వరల్డ్ కప్ లో పాక్ జట్టు పరాజయం పాలై ఇంటి బాట పట్టడంపై డిబేట్ నిర్వహించింది. ఇందులో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్  సహా పలువురు క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజాక్ క్రికెట్ తో ఎలాంటి సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ మీద చిల్లర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. “ఐశ్వర్య రాయ్ ని నేను పెళ్లి చేసుకుంటే, అందమైన పిల్లలు పుడతారనుకుంటే అది పొరపాటు అవుతుంది” అని వ్యాఖ్యానించాడు. ఆయన తీసుకున్న సందర్భానికి చెప్పిన ఉదాహారణకు ఏమాత్రం సంబంధం లేదు. పైగా ఆయన కామెంట్స్ కు పక్కనే కూర్చున్న షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ సహా మిగతా క్రికెటర్లు నవ్వుతూ చప్పట్లు కొట్టారు.


    






ఇదేనా మీ సంస్కారం? రజాక్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు


అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై భారతీయ సినీ, క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దేశం మీకు నేర్పిన సంస్కారం ఇదేనా? అంటూ మండిపడ్డారు. అనవసర విషయాల్లోకి మహిళలను లాగి అవమానకర వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు. ఐశ్వర్య ఇంట్లో వాష్ రూమ్ శుభ్రం చేయడానికి కూడా పనికి రావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  


సారీ చెప్పిన రజాక్, వివరణ ఇచ్చిన అఫ్రిది


తన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో అబ్దుల్ రజాక్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. “నే క్రికెట్ కు సంబంధించి ఓ ఎగ్జాంఫుల్ ఇవ్వాలి అనుకున్నాను. అదే సమయంలో అనుకోకుండా నోరు జారాను. ఐశ్వర్య పేరును ప్రస్తావించాను. ఆమెను కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి” అంటూ రజాక్ వెల్లడించాడు. అటు ఐశ్వర్య గురించి రజాక్ చేసిన వ్యాఖ్యలను విని నవ్విన అఫ్రిది ఆ తర్వాత వివరణ ఇచ్చాడు. ఆ సమయంలో అందరూ నవ్వారు కాబట్టే తానూ నవ్వానని చెప్పాడు. “ఇంటికి వెళ్లి మరోసారి ఆ వీడియోను చూశాక చాలా ఫీలయ్యాను. వెంటనే రజాక్ తో మాట్లాడి క్షమాపణ చెప్పాలని కోరాను. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే” అని వెల్లడించాడు.   






రజాక్ వ్యాఖ్యలను ఖండించిన   షోయబ్‌ అక్తర్‌


అటు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ రజాక్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాడు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పాడు.  ఆ సమయంలో పక్కనే ఉన్న క్రికెటర్లు నవ్వడం, చప్పట్లు కొట్టడం కూడా క్షమించరాని తప్పు అన్నాడు. ఏ స్త్రీని కూడా ఇలా అగౌరవ పరచకూడదని తేల్చి చెప్పాడు. 


Read Also: 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?