Andhra Pradesh Politics : ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugudesam) అధ్యక్షుడు (President) అచ్చెన్నాయుడు (Achennaidu)ను ఓడించేడమే లక్ష్యంగా అధికార వైసీపీ (Ycp) పావులు కదుపుతోంది. స్థానికంగా బలమైన సామాజిక వర్గానికి కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా అచ్చెన్నాయుడుపై పైచేయి సాధించవచ్చని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 1996, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలుపొంది..హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు అచ్చెన్నాయుడు. నియోజకవర్గాల పునర్విభజనతో టెక్కలి అసెంబ్లీ స్థానానికి మారిపోయారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన అచ్చెన్నాయుడు...చంద్రబాబు కేబినెట్ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఐదోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం...రాజకీయంగా చాలా కీలకం. ఇక్కడ నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని పార్టీకి...కుటుంబానికి కంచుకోటగా కింజరాపు కుటుంబం మార్చుకుంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతగా పేరున్న అచ్చెన్నాయుడును ఓడించేందుకు వైసీపీ ఎత్తులు వేస్తోంది. 


వైసీపీ నేతల ప్రత్యేక వ్యూహాలు


వైసిపి అధిష్టానం పక్కా లెక్కలు, ఈక్వేషన్స్ తో అచ్చెన్నాయుడును ఓడించేందుకు అస్ర్తశస్త్రాలు సిద్దం చేస్తోంది. సర్వ శక్తులు ఒడ్డైనా సరే...ఏపీ టీడీపీ అధ్యక్షున్ని శాసనసభకు వెళ్లకుండా... వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. కింజరాపు కుటుంబంలో ఎర్రన్న తర్వాత వినిపించే పేరు అచ్చెన్నాయుడు.  గత ప్రభుత్వంలోనూ...పార్టీలోనూ కీలక స్దానం‌ కట్టబెట్టింది తెలుగుదేశం. యువకుడైన ఎంపి రామ్మోహన్ నాయుడు మించి పార్టీలో అచ్చన్నకు ప్రాధాన్యత ఇచ్చింది.  గత ఎన్నికల్లో వైసిపి గాలిలో సైతం టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు సునాయాసంగా విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడిని గట్టిగా టార్గెట్ చేసింది వైసిపి అధిష్టానం. వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ఓడించేందుకు...వైసీపీ నేతలు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసింది.  కచ్చితంగా టెక్కలిలో అచ్చెన్న సీటు చింపేయాలని భావిస్తోంది.


కళింగ సామాజిక వర్గానికి కీలక పదవులు


అచ్చెన్నాయుడు గెలుపునకు ప్రధాన కారణం వర్గ విభేదాలే అన్న సత్యాన్ని వైసిపి నాయకత్వం గుర్తించింది. అందుకే ఎప్పుడూ కలవని కళింగ సామాజిక వర్గం మొత్తాన్ని...ఇప్పుడు ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట. టెక్కలి నియోజకవర్గానికే చెందిక కీలక నేతలకు పదవులు కట్టబెట్టిందట‌. జిల్లాలో ఒక ఎంపి, మూడు ఎమ్మెల్యే సీట్లు అఫర్ చేసింది. నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు  కళింగ నేతలను కలిసిపోయేలా ఎత్తులు సిద్ధం చేసింది. టెక్కలి అసెంబ్లీ ఇంచార్జ్‌గా ‌ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ప్రకటించిన అధిష్టానం... మరో ‌కీలక నేత పేరాడ తిలక్‌ను ఎంపీ అభ్యర్దిగా ప్రకటించింది.  మరో కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి  కిల్లి కృపారాణికి ప్రాధాన్యత కలిగిన పదవిలో కూర్చోబెట్టేందుకు ప్లాన్ రెడీ చేసింది. గతంలో మూడు ముక్కలాటగా మారిన‌ నేతలను ఒకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. కీలక  నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు,  నియోజకవర్గం అభివృద్ది అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం‌ చేస్తోంది. వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సామాజిక సమీకరణ తొడైతే...విజయం సాధిస్తామనే ఆలోచనలో వైసీపీ ఉంది.