Navaratnalu Plus 2024: : సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించగా, తాజాగా సీఎం జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్ర కూడా నిర్వహించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కీలకమైన మేనిఫెస్టో విడుదలకు వైసీపీ సిద్ధమవుతోంది. శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మేరకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసింది. వైసీపీ మేనిఫెస్టోను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ అనేక కీలక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు కొన్ని మార్పులు, చేర్పులు చేసేలా మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్దిరోజులు మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడిన బృందం పూర్తి చేసింది.
ఆర్థిక లబ్ధిని పెంచేలా యోచనలో
రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అనేక కీలక పథకాలను అమలు చేస్తోంది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు-నేడు, విద్యార్థులకు ఉచిత ట్యాబ్స్ పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, వైఎస్‌ఆర్ ఆసార, కాపు నేస్తం, నేతన్న చేయూత వంటి పథకాలను అధికార పార్టీ అమలు చేస్తోంది. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు మరికొన్ని కీలక పథకాలను రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే అమలు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా అందిస్తున్న ఆర్థిక లబ్ధిని కూడా కొంత వరకు పెంచే చాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికే సీఎం జగన్ మేనిఫెస్టోకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. అమలు చేయలేని హామీలను ఇవ్వనని.. చేసేవి మాత్రమే చెబుతానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి కొన్ని భారీ స్థాయిలో మేనిఫెస్టోలో పెద్ద హామీలు ఉండవని ఆ పార్టీలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయానికి దోహదం చేసే మూడు నుంచి ఐదు వరకు కీలక హామీలు ఉంటాయని, ఇవి పార్టీ విజయానికి దోహదం చేసేవిగా మారవచ్చన్న భావనను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.