Top 5 Reasons for YSRCP Loss in AP Elections 2024 | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఏం చేయలేదా అసలు. సరే అభివృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాలు అమలు చేశాడు కదా. ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూరేలా వాళ్లంతా ఏదో ఒక పథకంలో ఉండేలా వాలంటీర్లతో ఫాలో అప్ చేయించి మరీ సంక్షేమ ఫలాలు అందించాడు కదా. మరి ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ తేడా కొట్టింది. 175 నియోజకవర్గాల్లో 151 కొట్టేసిన అదే పార్టీ (YSRCP).. ఇప్పుడు కనీసం పదో నెంబర్ అంకెకు అటూ ఇటూ ఊగిసలాడటం ఏంటి?.


అయితే మిస్టేక్స్ ఏంటో అని ఆలోచించే ముందు ఠక్కున గుర్తొచ్చేస్తున్న ముఖాలు కొన్ని ఉన్నాయి. వీళ్ల మీద మాకేమీ పర్సనల్ గ్రెడ్జ్ లేదు. అలా మర్చిపోయే ముఖాలు కాదు వారివి. జర్నలిస్టులైన  మా చెవులు చిల్లులు పడేలా బూతులతో రెచ్చిపోయారు. అసభ్య పదజాలాలు, వ్యక్తిగత దూషణలతో పరమ చిరాకు తెప్పించారు. ఓ పక్కన జగనన్న వై నాట్ 175 అంటుంటే వీళ్లేమో నోరు పారుదల శాఖ మంత్రుల్లా జనాల చెవులు తుప్పు వదలగొట్టేశారు. జనాలకు ఎంత చిరాకు వచ్చిందంటే పెద్దిరెడ్డి, జగన్ రెడ్డి తప్ప క్యాబినెట్ లో ఉన్న ఏ మంత్రి గెలవలేదు. టక్కున గుర్తొచ్చే ఐదు పేర్లు, వివరాలపై ఓ లుక్కేయండి.


1. కొడాలి నాని
ప్రతిపక్షాలను తిట్టొచ్చు కానీ మరీ వ్యక్తిగత దూషణలు.. అమ్మనా బూతులు.. కొడాలి నాని మాటలు వింటే చాలు ఈయన మంత్రి ఏంటి రా బాబు అని జనాలు తల పట్టుకున్నారు. మంత్రిగా కూడా అవకాశం ఇచ్చిన జగనన్నకు బూతులతో నోరేసుకుని పడితేనే రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అని ఫీలయ్యారేమో.. కొడాలి నాని మాటలతో వైసీపీకి భారీ డ్యామేజ్ చేశారు. అది ఎంతెలా ఉంటే టీడీపీలో ఉన్నా, వైసీపీకి వచ్చినా ఓటమి ఎరుగుని ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని పరాజయం చూడటమే కాదు.. వైసీపీకి పడాల్సిన ఓట్లకు ఘోరంగా గండి కొట్టారు.


2. ఆర్కే రోజా
మేడం రోజా గ్రేట్ పొలిటీషియన్. స్త్రీ సాధికారికతను బలంగా చాటుతూ నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ తరపున నిలిచిన స్ట్రాంగ్ నేత ఆమె. అలాంటి రోజా గారు తిట్ల పురాణం ప్రజల్లో జుగుప్స కలిగించారు. తొలుత ఏపీఐఐసీ ఛైర్మన్ గా తర్వాత మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ ను మెప్పు పొందాలని ప్రతిపక్ష నేతల మీద వ్యక్తిగత దూషణలకు దిగుతూ రోజా చేసిన రచ్చ ఆమె పాలిటే బూమరాంగ్ గా మారింది. దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భాను ప్రకాష్ మీద రెండోసారి పోటీ చేసిన రోజా.. ఈసారి అనూహ్యంగా ఓటమి పాలవటమే కాదు వైసీపీ ఓట్ బ్యాంకుకు భారీగా డ్యామేజ్ చేశారు.


3. అంబటి రాంబాబు
 చూడటానికి పెద్దమనిషిలా హుందాగా కనిపించే అంబటి రాంబాబు వాస్తవానికి జగన్ లోయల్ కోటరీలో ఒకరు. వైఎస్సార్ మరణం తర్వాత ఒకానొక దశలో జగన్ ఒంటరిగా మారిపోయిన తరుణంలో అంబటి రాంబాబు జగన్ వెంటే ఉండి ఆయన నమ్మకాన్ని చూరగొన్నారు. అలాంటి అంబటికి సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్న జగన్.. ఆయనకు నీటి పారుదల శాఖ మంత్రి పదవి కూడా గౌరవించారు. అలాంటి పెద్ద మనిషి పోలవరం గురించి మీడియా అడిగితే కాఫర్ డ్యామ్ అసలు అవసరమా అంటారు.. రిటైనింగ్ వాల్ గురించి నన్ను అడుగుతారేంటీ ఏంటూ మీడియానే వెటకారం చేస్తూ ఎదురు ప్రశ్నిస్తారు. సొంతల్లుడే మా మావయ్య ఓ లోఫర్ అంటూ వీడియోలు చేసి పెట్టినా పండుగలు వేస్తూ చాలా డ్యాన్స్ చేస్తూ వైరల్ అవటం.. ఫోన్స్ కాల్స్ లో టాలెంట్ చూపిస్తూ అడ్డంగా దొరికిపోయి పార్టీకి డ్యామేజ్ చేయటం తప్ప నమ్మిన జగన్ కు.. వైసీపీకి ఓటు బ్యాంక్ మేనేజ్ చేసింది మాత్రం శూన్యం.



4. గుడివాడ అమర్నాథ్
ఈయన ఐటీ శాఖామంత్రిగా సేవలు అందించిన టెక్నోక్రాట్. హైదరాబాద్ లో ఈ రేస్ కి అటెండ్ అయ్యి ఏపీలోనూ ఇలాంటివి పెడతారా అని ప్రెస్ పొరపాటున అడిగిన దానికి కోడి గుడ్డు పెట్టింది.. పొదగటానికి టైమ్ పడుతుంది అంటూ తెలుగోళ్లకు తెలియని సామెతలు చెప్పి ట్రోల్ మెటీరియల్ అయ్యారు. పవన్ కళ్యాణే తనను అడిగి ఫోటో తీయించుకున్నాడని ఓ సారి.. దావోస్ లో పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్లలేదు అంటే అక్కడ మైనస్ డిగ్రీల్లో చలి ఉంటుంది కాబట్టి ఏం పోతామని మరోసారి చెప్పి వావ్ ఐటీ మినిస్టర్ ఇలానే ఉండాలి. కానీ కేటీఆర్ లా కంపెనీలు తీసుకురావటం ఏంటీ అని ఏపీ ప్రజలు రియలైజ్ అయ్యేలా ఓ ఎగ్జాంపుల్ ను సెట్ చేశారు. అందుకే గాజువాక ప్రజలు ఈ ఎన్నికల్లో అదే కోడి గుడ్డును గిఫ్ట్ ఇచ్చి సదరు మంత్రి గారిని సాగనంపారు.



5. పేర్ని నాని
మా ఊరే మా బందరు ముద్దు బిడ్డ. పేర్ని కృష్ణమూర్తి గారి వారసుడి పాలిటిక్స్ లో అడుగుపెట్టిన పేర్ని వెంకట్రామయ్య... నానిగానే అందరినీ ఆకట్టుకుని జగన్ మనిషిగా వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడిగా ముందు కాంగ్రెస్ లో తర్వాత వైసీపీలోనూ మంచి పేరు సాధించుకున్నారు. అలాంటి మనిషిగారు మంత్రిగారవ్వగానే పేర్ని నాని అంటే చాలు పవన్ కళ్యాణ్ ను తిట్టే శాఖ మంత్రి అన్నట్లు మళ్లీ నామకరణోత్సవం చేసుకున్నారు. మా నాయుడు గాడు పవన్ నాయుడు గాడు అంటూ బందరోళ్లకు తెలియని ఎటకారాన్ని చూపిస్తూ చివరకు చల్లగా ఎన్నికల నుంచి తప్పుకున్నారు. కానీ ఆయన నోటి కండూతి పాపం ఆయన కొడుకు, రాజకీయ వారసుడు పేర్ని కిట్టుకు తాకింది. తొలి ప్రయత్నంలోనే కిట్టు బోర్లా పడ్డారు. తండ్రి తీసుకువచ్చిన అపరమితమైన పేరును మోయలేక చిరకాల ప్రత్యర్థి కొల్లు రవీంద్రకు విజయాన్ని బందరులడ్డూలా అప్పగించటమే కాదు... వైసీపీ ఓట్ బ్యాంకు కన్నానికి కారణమైన వారిలో ఒకరిగా నిలిచారు.


పైన చెప్పిన వాళ్లు మాత్రమే కాదు.. వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వల్లభనేని వంశీ ఉన్నారు. ఇలా ఓ చాంతాడంత లిస్టు ఉంది. అంతా కలిసి పాపం సింహం లాంటి జగనన్నను, సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లిన ఆయనను దాదాపు సింగిల్ డిజిట్ కు పరిమితం చేసింత పనిచేశారు.