TDP News: అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సదరు ముగ్గురు కీలక నేతలతో టీడీపీ సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. వీరిలో రాజ్యసభ ఎంపీ, వచ్చే ఎన్నికలకు నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ బరిలో దించాలని భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు.


వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, టీటీడీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్న ప్రశాంతి టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరిద్దరూ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇది వైసీపీ అధినాయకత్వం ఊహించని పరిణామంగానే చెప్పాలి. నెల్లూరు లోక్‌సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నిలిపింది. అయితే, పార్లమెంట్‌ స్థానం పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేయాలంటూ వైసీపీ నాయకత్వానికి ఆయన సూచించారు. కానీ, ఆయన మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడంతో పార్టీకి కొద్ది రోజులు నుచి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజులు కిందట సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా వేమిరెడ్డి ఆయనను కలువకుండా విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారని, టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 


ఆదాల ప్రభాకర్‌ రెడ్డిదీ అదే దారి


ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. ఈయన్ను కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు. అక్కడి నుంచే పోటీ చేస్తారని అధిష్టానం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఆయన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ, ఈయన టీడీపీలోకి వెళ్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ పుకార్లను ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే ప్రచారం జరుగుతోంది. 


ఆర్థికంగా అత్యంత బలమైన వ్యక్తి కావడంతో టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించిన ముఖ్య నాయకులు ఈ మేరకు ఆదాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆదాల టీడీపీలో చేరిక ఎంత వరకు వాస్తమో తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయన ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించలేదు. కానీ, గడిచిన రెండు, మూడు రోజులు నుంచి ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండడంతో నెల్లూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 


మాగుంట దారి అటే


ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరిక దాదాపు ఖాయమైనట్టే చెబుతున్నారు. వైసీపీ అధిష్టానం మాగుంటకు టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు టికెట్‌ ఇప్పించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. కానీ, ఆయనకు సీటు ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించలేదు. ఒకానొక దశలో బాలినేని తీవ్ర అలకబూనారు. పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. కానీ, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి బాలినేనితో మాట్లాడిన తరువాత ఇక్కడ వివాదాలు సద్దుమణిగాయి. వైసీపీలో టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మాగుంట టీడీపీలో చేరే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఒకేసారి ముగ్గురు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలో చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ అయింది. అయితే, నెల్లూరు ఎంపీలు ఇద్దరూ టీడీపీలో చేరతారా..? లేదా..? అన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో, పార్టీ వర్గాల్లో మాత్రమే ఆ ఇద్దరి ఎంపీల చేరికపై ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఆ ఇరువురు నేతలు, వారి అనుచరులు గానీ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పడం లేదు.