CM Jagan File His Nomination Today : ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తన సొంత నియోకవర్గమైన పులివెందులలో ఆయన నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకు ఆ పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నామినేషన్‌కు ముందు సీఎం జగన్‌ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. అనంతరం పులివెందుల వైఎస్‌ఆర్‌ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని ఆర్‌వో కార్యాలయంలో జగన్‌ నామినేషన్‌ వేయనున్నారు. భారీ జన సందోహం మధ్య నామినేషన్‌ దాఖలు చేయడానికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 


నేటితో ముగియనున్న గడవు


రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్తానాలకు నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు వేలాది నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు 3,644 మంది అభ్యర్థులు, లోక్‌సభకు 654 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. చివరి రోజైన గురువారం మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు 1294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. లోక్‌సభకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ముఖ్య నాయకులు ఉన్నారు. వీరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశైరి, ఉదయ్‌ శ్రీనివాస్‌, సీఎం రమేష్‌ తదితరులు ఉన్నారు. 


ఇవీ నామినేషన్ల దాఖలైన తీరు


25 పార్లమెంట్‌ సెగ్మెంట్లకు 555 మంది అభ్యర్థులు 653 సెట్ల నామినేషన్లను గడిచిన ఆరు రోజుల్లో దాఖలు చేశారు. తొలిరోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, రెండోరోజు 68 సెట్లు, మూడో రోజు 40 సెట్లు, నాలుగో రోజు 112 సెట్ల, ఐదో రోజు 124 సెట్లు, ఆరో రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ స్థానాలకు గడిచిన ఆరు రోజజుల్లో 3057 మంది అభ్యర్థులు 3701 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు 236 సెట్ల, రెండో రోజు 413, మూడో రోజు 263 సెట్లు, నాలుగో రోజు 610 సెట్లు, ఐదో రోజు 702 సెట్లు, ఆరో రోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆఖరి రోజైన గురువారం మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.