Congress leader Rahul Gandhi meets job aspirants: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. అందుకే నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్, బీజేపీలు పదే పదే ప్రస్తావిస్తూ యూత్ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను కలిశారు. వారి సమస్యలు విని రాహుల్ గాంధీ చలించిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress Government in Telangana) ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు.


తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం తనను కలిచివేసిందన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర యువతకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారంటూ మండిపడ్డారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే యువతకే కొలువులు రాని దుస్థితి నెలకొందన్నారు. అందుకే యువత కలలు సాకారం అయ్యేలా, కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండరును రూపొందించిందన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన అనంతరం యువతతో కలిసి రాహుల్ టీ తాగారు. త్వరలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మీ సమస్యలు తీరుతాయని వారికి భరోసా ఇచ్చారు. 


టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయని, అయితే ఆ తప్పులను తామే గుర్తించామని మంత్రి కేటీఆర్ ఇటీవల నిరుద్యోగులతో అన్నారు. అధికారంలోకి వచ్చాక టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రస్తుతం తమకు సమయం లేదని, వీలుకాదని.. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటిరోజే అశోక్ నగర్ కు తానే స్వయంగా వచ్చి నిరుద్యోగుల సమస్యలు విని, వారి సలహాలు తీసుకుంటానని భరోసా ఇవ్వడం తెలిసిందే. 






ఉద్యోగాల భర్తీపై నెలకొన్న సమస్యలపై యువతతో చర్చించేందుకు డిసెంబర్ 4వ తేదీన 10 గంటలకి అశోక్ నగర్ లో సమావేశం అవుతానని వారికి కేటీఆర్ (Telangana Minister KTR) భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరు ప్రశ్నించే అవకాశం లేదన్నారు. ఏడాదికి 1000 ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదన్నారు. యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి రెట్టింపుకు పైగా 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని కేటీఆర్ ఇటీవల తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,62,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.