Revanth Reddy Public Meeting: కామారెడ్డి (Kamareddy) ప్రజలకు అండగా ఉండేందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని రెడ్డిపేటలో నిర్వహించిన విజయభేరి యాత్ర (Vijayabheri Yatra) లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావని చాలా మంది అడిగారని, అప్పుడు సమాధానం చెప్పలేదని, ఇప్పుడు చెబుతా అన్నారు. బీఆర్ఎస్ (BRS) దోపిడీ నుంచి ప్రజలకు కాపాడేందుకు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను ఊరి పొలిమేర వరకు తరుముతానని అన్నారు.


ప్రజల భూములు కాపాడే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు రాక తెలంగాణ యువత పోరాటం చేసి తెలంగాణ  సాధించుకున్నారని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ, యువత ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటురని అన్నారు.  


ఇంత మంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడితే కేసీఆర్, ఎమ్మెల్యేలు ఏనాడైనా ఒక్క కుటుంబాన్ని పరామర్శించారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని యువతను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనది అన్నారు. కామారెడ్డి చుట్టూ మాస్టర్ ప్లాన్ పేరుతో భూములు గుంజుకునే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దానిని వ్యతిరేకిస్తూ రైతులు ధర్నాలు చేస్తే పోలీసుల బూటు కాలితో తన్నించారని విమర్శించారు.


పండించిన పంట కోనే వారు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న నాథుడే లేడని మండిపడ్డారు. భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామన్నారు. ప్రజలకు రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. షబ్బీర్ అలీ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి నీరు వచ్చిందని, ఇళ్లు మంజూరు అయ్యాయని, ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.  కేసీఆర్ దళితలకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. 


 స్టేషన్ ఘన్‌పూర్‌లో మాట్లాడుతూ..
 స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ విజయ భేరీ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ నాయకులే నమ్మడం లేదన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో దళితులకు స్థానం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆవేదన వ్యకం చేశారు. కేసీఆర్ లాంటి దోపిడీదారు దేశంలోనే లేరని దుయ్యబట్టారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఏం చేశారని మూడోసారి అధికారం ఇవ్వమని కేసీఆర్ అడుగుతున్నారని దుయ్యబట్టారు.


 బీఆర్‌ఎస్‌లో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ 12 మందికి అవకాశం కల్పించిందని రేవంత్ చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత ఉన్న చోటే అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. వైన్ షాపులు పెట్టి పేదల ఆస్తులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.  ఘన్‌పూర్‌కు 100 పడకల ఆస్పత్రిని తీసుకురాలేకపోయారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు.