CM KCR Phone Calls To Candidates: తెలంగాణలో పోలింగ్‌ తేదీ దగ్గర పడుతోంది. మరో వారంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టాలని  భావిస్తోంది బీఆర్‌ఎస్‌. దీంతో సీఎం కేసీఆర్‌ స్వయంగా.. నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రోజూ ఫోన్లు చేస్తూ.. నియోజకవర్గాల్లో పరిస్థితిని  తెలుసుకుంటున్నారు. సానుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషిస్తూ... వారికి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. సమన్వయంతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. 


ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంత బిజీలోనూ.. నియోజకవర్గాల్లో పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు  ముఖ్యమంత్రి. ప్రచారానికి వెళ్లే ముందు... ప్రతిరోజూ ఉదయం కేసీఆర్‌ అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ఉంది...  బీఆర్‌ఎస్‌కు సానుకూలత ఎంత... ప్రతికూలత ఎంత అన్నది ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. తన దగ్గర రిపోర్టుల ఆధారంగా... నియోజకవర్గాల్లో మెరుగుపడాల్సిన అంశాలపై  అభ్యర్థులను సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. 


అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్... పదే పదే చెప్తున్నట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ఎక్కువ సమయం  లేకపోవడంతో... ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచిస్తున్నారట. చిన్న విషయంలో కూడా అశ్రద్ధ వద్దని... ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా  ఉండాలని అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నారట గులాబీ బాస్‌. ప్రతికూలతలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నాయకుల మధ్య  సమన్వయ లోపం ఉన్న ప్రాంతాల్లో... కిందస్థాయి నేతలకు కూడా సీఎం కేసీఆర్‌ నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారట. కలిసి పనిచేయాలని సూచిస్తున్నారట. 


పోల్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెడుతోంది బీఆర్‌ఎస్‌ పార్టీ. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను ఐదు విభాగాలుగా గుర్తించి... జాబితా సిద్ధం చేసుకుంది. పూర్తి అనుకూల  ఓట్లను ఒక వర్గంగా... బీఆర్‌ఎస్‌ వర్గంలోని అసంతృప్త ఓట్లను మరో వర్గంగా... ప్రతిపక్షాల అనుకూల ఓటర్లను మూడో వర్గంగా... తటస్థంగా ఉండేవారిని నాలుగొ వర్గంగా.. ఏ  పార్టీకి చెందని వారిని ఐదో వర్గంగా విభజించి లిస్టు రెడీగా పెట్టుకుంది. వీటిలో మొదటి వర్గం ఓట్ల ఎలాగూ బీఆర్‌ఎస్‌వే కాగా... ప్రతిపక్షాల ఓటర్లు బీఆర్‌ఎస్‌వి కావు. ఇక  మిగిలిన మూడు వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందుకు ప్రతి 100 మంది ఓటర్లకు నలుగురు ఇన్‌ఛార్జులను నియమించింది. ఆ  నలుగురు కచ్చితంగా ఆ 100 ఓట్ల పరిధిలోనే ఉండేలా చూసుకుంది. 


ఆ నలుగురు ఇన్‌ఛార్జ్‌లు... 100 మందిని బీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి రోజూ వార్డుల్లో పర్యటిస్తూ బీఆర్‌ఎస్‌ ఇస్తున్న హామీలను వారికి  వివరిస్తున్నారు. అంతేకాదు.. పోలింగ్‌ రోజు ఆ 100 మందిని పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత కూడా ఆ నలుగురు ఇన్‌ఛార్జ్‌లకే అప్పగించింది బీఆర్‌ఎస్‌  పార్టీ. ఆఖరి వారం రోజుల్లో.. కార్యాచరణను ముమ్మరం చేసింది. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు మూడు రోజుల్లో ఏం చేయాలన్నది దానిపై ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ నేతలకు  దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని... హ్యాట్రిక్‌ కొట్టితీరాలన్న లక్ష్యంతో ఉంది బీఆర్‌ఎస్‌ పార్టీ. మరి ప్రజల తీర్పు ఎలా  ఉండబోతుందో చూడాలి.