Telangana Election Counting: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు సిద్ధంగా ఉంది. ముందస్తు జాగ్రత్తగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను వెంటనే తరలించేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. అందుకోసం డీకే శివ కుమార్ హైదరాబాద్ లో ఉండి.. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ కు కాస్త అటుఇటుగా సీట్లు గెలిచిన పక్షంలో  గెలిచిన అభ్యర్థులను వెంటనే హోటల్ కు తరలించాలని ప్లాన్ చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇక్కడ గెలిచిన వారిని అటాచ్ చేసినట్లు తెలిసింది. 


కౌంటింగ్ ముగిసి రిటర్నింగ్ అధికారి నుంచి గెలిచినట్లుగా లేఖ అందుకున్న వెంటనే.. ఆ అభ్యర్థిని తాజ్ కృష్ణా హోటల్ కి తీసుకు వెళ్లబోతున్నారు. ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ అభ్యర్థుల తరలింపు కోసం మూడు బస్సులను రెడీ చేశారు. అవసరమైతే తాజ్ కృష్ణా హోటల్ నుంచి ఆ బస్సుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను వెంటనే అక్కడి నుంచి తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.






అవసరమైతే ఎమ్మెల్యేలను తరలిస్తాం - కర్ణాటక మంత్రి


‘‘కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ ఇక్కడ చేసిందేమీ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారు’’ అని కర్ణాటక మంత్రి రహీమ్ ఖాన్ తాజ్ క్రిష్ణా హోటల్ వద్ద తెలిపారు. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైన పరిస్థితుల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు అవసరమైతే ఎమ్మెల్యేలను తరలించడానికి కూడా తాము రెడీగా ఉన్నామని వివరించారు.