Palakurti Constituency News : తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao) కాంగ్రెస్ (Congress)నేతలకు సవాల్ విసిరారు. తనపై పోటీ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని, అరువు తెచ్చుకున్న అభ్యర్థులను పోటీలోకి దించారని మండిపడ్డారు. తనపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు సిద్ధంగా లేరని, అందుకే విదేశాల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చిందన్నారు ఎర్రబెల్లి. 


లక్ష మెజార్టీతో గెలుస్తా
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం(Palakurti Legislative Assembly Constituency) రాయపర్తి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనపై నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేదా అన్న ఆయన, డబ్బు బాగా ఉన్నవారినే బరిలోకి దించారని అన్నారు. స్థానికంగా ప్రజలకు సేవ చేసే నాయకులను కాదని, ఎన్నారైలకు ఓట్లు వేసే స్థితిలో పాలకుర్తి ప్రజలు లేరని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారే లేరా అని ప్రశ్నించారు. రాగన్న గూడెం, గణేష్ కుంట, జేతురాం తండా, జింకురాం తండా, కేశవాపురం, కొలన్ పల్లె, పోతిరెడ్డి పల్లె గ్రామాల్లో మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు.  ప్రచారంలో గిరిజన మహిళలతో కలిసి దాండియా పాటలకు నృత్యాలు చేశారు. పాలకుర్తిలో లక్ష మెజారిటీతో తాను గెలుస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. 


డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఎర్రబెల్లి


ఎర్రబెల్లి దయాకర్ రావు 1983లో తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి శాసన సభ్యులుగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1987లో వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పని చేశారు. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్రెబెల్లి దయాకర్ రావు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో వర్దన్నపేట నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రవీంద్ర నాయక్ ను ఓడించారు.


ఎంపీగానూ గెలుపొందిన ఎర్రబెల్లి


తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి ఎంపీగా గెలిచి, పార్లమెంట్ లో అడుగు పెట్టారు. వర్దన్నపేట అసెంబ్లీ 2009లో ఎస్సీ రిజర్వ్ స్థానంగా మారింది. దీంతో ఎర్రబెల్లి దయాకరావు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి నాలుగోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ తరపున గెలుపొందారు ఎర్రబెల్లి దయాకరరావు. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షా నేతగా వ్యవహరించారు. ఆ తర్వాత కొంతకాలానికే కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు.