హుస్నాబాద్‌ సీఎం కేసీఆర్‌కు కలిసొస్తుందా? అందుకే.. ఈసారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారా? అంటే బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అవుననే  సమాధానం వస్తుంది. 2014, 2018లో కూడా కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచే ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ను  అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు సీఎం కేసీఆర్‌. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్‌ నుంచే  ప్రారంభించబోతున్నారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్‌ నుంచి ప్రారంభించారు కేసీఆర్‌. ఆ ఎన్నికల్లో 119  స్థానాలకుగాను 63 స్థానాల్లో కేసీఆర్‌ విజయం సాధించారు. పాలనాపగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. ఎన్నికల ప్రచారాన్ని మాత్రం  హుస్నాబాద్‌ నుంచే ప్రారంబించారు. 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో ఘనవిజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ కొట్టాలన్న పట్టుదలతో  ఉన్నారు సీఎం కేసీఆర్‌. 100కుపైగా స్థానాల్లో గెలవాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అందుకే... గత సెంటిమెంట్‌ ప్రకారం ఈసారి కూడా హుస్నాబాద్‌ నుంచే ఎన్నికల  సమరశంఖం పూరించబోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 


తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత... ప్రచార హోరు జోరందుకుంది. పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత,  సీఎం కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ను బీఆర్‌ఎస్‌ ఖారారు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా ఎన్నికల  ప్రచారంలో నిమగ్నమవుతారు. 15వ తేదీన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాంలు అందజేసి.. దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు.. హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.  ఈ సభతోనే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు కేసీఆర్‌. 


హుస్నాబాద్‌ నుంచి మొదలైన సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రక్రియ... నవంబర్ 9 వరకు కొనసాగనుంది. 17 రోజుల పాటు 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు  చేయనున్నారు ముఖ్యమంత్రి. రోజుకు రెండు లేదా మూడు సభల్లో కేసీఆర్​ పాల్గొనేలా బీఆర్‌ఎస్‌ షెడ్యూల్‌ సిద్ధం చేసి రిలీజ్‌ చేసింది. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌,  కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. నవంబర్‌ 9న ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు కేసీఆర్. 9వ తేదీ  ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌, మధ్యాహ్నం రెండు  గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.


కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌


అక్టోబర్‌ 15 - హుస్నాబాద్‌
అక్టోబర్‌ 16 - జనగాం, భువనగిరి
అక్టోబర్‌ 17 - సిరిసిల్ల, సిద్దిపేట
అక్టోబర్‌ 18 - జడ్చర్ల, మేడ్చల్‌
అక్టోబర్‌ 26 - అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్‌ 27 - పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్
అక్టోబర్‌ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్‌ 30 - జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌
అక్టోబర్‌ 31 - హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్‌ 01 - సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్‌ 02 - నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి
నవంబర్‌ 03 - భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 05 - కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 06 - గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట
నవంబర్‌ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్‌ 08 - సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి
నవంబర్‌ 09- కామారెడ్డి