Rahul Election Campaign: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ బస్ యాత్రలో పాల్గొన్నారు. జయశంకర్‌ భూపాల్‌ పల్లిలో పర్యటించిన రాహుల్ గాంధీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. తెలంగాణలో ఇన్నేళ్లు కుటుంబ పాలన నడిచిందన్నారు. కేసీఆర్‌ ఆయన ఫ్యామిలీ భారీ అవినీతి పాల్పడిందని ఆరోపించారు. వారి అవినీతిని వేరే రాష్ట్రాలకు విస్తరించారని మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం బాగుపడిందే తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడలేదన్నార రాహుల్. అందుకే ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు జరుగుతున్నవిగా అభివర్ణించారు. 


ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమైనట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంటుందే కానీ విచారణ చేపట్టదని అన్నారు. సీబీఐ, ఈడీ సైలెంట్‌గా ఉంటాయన్నారు. తనపై మాత్రం 24 కేసులు పెట్టారని ఆరోపించారు. 


తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు రాహుల్. ఈ మూడు పార్టీలు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయన్నారు. బీఆర్‌ఎస్‌కు, బీజేపీ, బీజేపీకి బీఆర్‌ఎస్‌ సపోర్ట్ చేసుకుంటున్నాయన్నారు. పార్లమెంట్‌లో పెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. అవినీతి కారణంగానే పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని అన్నారు. 


దేశంలో కుల గణన జరగాలని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ. దేశాన్ని నడిపిస్తున్న ఉన్నతాధికారుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది అని అడిగానని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అందుకే కుల గణన జరగాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు.