Telangana Assembly Elections : మార్పు కావాలి-కాంగ్రెస్‌ రావాలి ( Marpu kavali-Congress Ravali ) అంటూ కాంగ్రెస్‌ పార్టీ (Congress Party )చేసిన నినాదాన్ని తెలంగాణ (Telangana )ప్రజలు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. తెలుగుదేశం పార్టీ (Telagudesam Party )ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి 60కిపైగా సీట్లు సాధించడం తొలిసారి. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసొచ్చాయని విశ్లేషకుల అంచనా. గులాబీ పార్టీ 39 సీట్లకే పరిమితమై డీలా పడింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గజ్వేల్‌లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించగా.. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు. కారు పార్టీ తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. 2018లో 19 సీట్లకే పరిమితమైన హస్తం పార్టీ...2023 వచ్చేసరికి 64 సీట్లతో గెలుపొందింది. బీఆర్ఎస్‌ 88 సీట్లలో గెలుపొంది అధికారాన్ని చేపట్టింది. ఎంఐఎం ఏడు, టీడీపీ రెండు చోట్ల గెలుపొందాయి. ప్రస్తుత ఎన్నికల్లో సీట్లు రావనుకున్న ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ సత్తా చాటింది. 2018లో 19 సీట్లకే పరిమితమైన హస్తం పార్టీ...2023 వచ్చేసరికి 64 సీట్లతో గెలుపొందింది. 


60 దాటని కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో ఈ సారి అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 70 నుంచి 80 సీట్లు వస్తాయని సభలు, సమావేశాల్లో పదే పదే చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సంగతి పక్కన పెడితే, గతంలో ఎన్ని సీట్లు సాధించిందన్న దానిపై లెక్కలు తీశారు. తెలంగాణ వచ్చాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ నాయకత్వానికే పట్టంకట్టారు. మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్‌ 60. గత 30 ఏళ్లలో ఎప్పుడైనా కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణలో 60 సీట్లు సాధించిందా అంటే సమాధానం లేదు . తొలి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 22 సీట్లు వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 సీట్లు మాత్రమే వచ్చాయి.  కాంగ్రెస్ పార్టీ 2004, 2009లో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో హస్తం పార్టీకి 185 సీట్లు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవి 48 మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో కాంగ్రెస్‌కు 156 సీట్లు వచ్చాయి. ఇందులో తెలంగాణలో వచ్చింది కేవలం 49 సీట్లే. తెలుగుదేశం పార్టీ 1994, 1999 వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేదు. 


1989లో అత్యధికంగా 59 సీట్లు
1999 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు 42 సీట్లు వచ్చాయి. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉమ్మడి ఏపీ అంతా కలిపి వచ్చింది కేవలం 26సీట్లు. 1989లో కాంగ్రెస్‌కు 181 సీట్లు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవి 59 సీట్లు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వచ్చిన అత్యధికం 59. అది కూడా 1989లో. గత 30 ఏళ్ల చరిత్ర తీసుకుంటే, కాంగ్రెస్‌కు తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59 మాత్రమే. 60 సీట్లు ఏ నాడూ దాటలేదు. గత రికార్డులను పరిశీలిస్తే, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో సాధించిన అంతంతమాత్రమే. నాలుగు దశాబ్దాల తర్వాత 60కిపైగా సీట్లు సాధించిన కాంగ్రెస్...పాత రికార్డులను బద్దలు కొట్టింది.