Tamil Nadu Assembly Elections stalin lost: తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని పెను సంచలనం నమోదైంది. దశాబ్దాల పాటు ద్రవిడ రాజకీయాలను శాసించిన  డీఎంకే సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన పరాజయం ఒక ఎత్తైతే, ఏకంగా ముఖ్యమంత్రి  స్టాలిన్  తన సొంత కంచుకోట కొలత్తూరు నియోజకవర్గంలోనే ఓడిపోయారు. 2011 నుంచి ఎదురులేకుండా మూడుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన స్టాలిన్, ఇప్పుడు రాజకీయంగా అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. టీవీకే తరపున బరిలోకి దిగిన సాదాసీదా అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,000 ఓట్ల తేడాతో సిట్టింగ్ సీఎం ఓడిపోవడం ద్రవిడ రాజకీయాల్లో  సూర్యాస్తమయం గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Continues below advertisement

ఒకవైపు స్టాలిన్ పతనం దిగ్భ్రాంతి కలిగిస్తుంటే, మరోవైపు అన్నాడీఎంకే అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి   తన రాజకీయ చతురతను చాటుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన  ఎడప్పాడి నుంచి ఆయన దాదాపుగా లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పార్టీలో అంతర్గత విబేధాలు, విజయ్ పార్టీ నుంచి వస్తున్న పోటీని తట్టుకుని మరీ ఈపీఎస్ తన ఓటు బ్యాంకును కాపాడుకున్నారు.   అధికారంలో ఉండి కూడా ఐదేళ్లకే స్టాలిన్ తన నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం, క్షేత్రస్థాయిలో ఉన్న తీవ్రమైన అధికార వ్యతిరేకతకు అద్దం పడుతోంది.

ఈ ఎన్నికల ఫలితాలు డీఎంకేకు కేవలం ఓటమిని మాత్రమే కాదు, పార్టీ మనుగడకే సవాలుగా మారాయి. స్టాలిన్ కేబినెట్‌లోని ఉద్ధండులైన మంత్రులు సైతం కుప్పకూలారు. సీనియర్ నేతలు, జిల్లాల వారీగా పట్టున్న నేతలు తమ సొంత ఇలాకాల్లోనే ఓడిపోవడం పార్టీ కేడర్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ముఖ్యంగా యువత ,  మహిళా ఓటర్లు డీఎంకే వారసత్వ రాజకీయాలను తిరస్కరించి, విజయ్ వైపు మొగ్గు చూపడం స్టాలిన్ నాయకత్వ వైఫల్యంగా భావిస్తున్నారు. దశాబ్దాల కాలంగా నిర్మించుకున్న బలమైన ఓటు బ్యాంకు ఇప్పుడు టీవీకే వైపు మళ్లడం డీఎంకే భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది.

Continues below advertisement

తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల తర్వాత ఆ స్థాయి శూన్యాన్ని భర్తీ చేస్తారని ఆశించిన స్టాలిన్, ఐదేళ్లకే ఓటమి బాట పట్టడం డీఎంకే చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన ఇలాకాలో గెలవలేకపోవడం  స్టాలిన్ వ్యక్తిగత ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బతీసింది. మరోవైపు, అన్నాడీఎంకే తన సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంది.  పళనిస్వామి భవిష్యత్తు రేసులో బలమైన నాయకుడిగా నిలిచారు. పశ్చిమ తమిళనాడులో అన్నాడీఎంకే హవా కొనసాగడం ఈపీఎస్ నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా భావించవచ్చు.  

  కొలత్తూరులో ఉదయసూర్యుడు అస్తమించడం కేవలం ఒక నియోజకవర్గ ఫలితం కాదు, అది తమిళనాడులో ఒక రాజకీయ శకం ముగిసిందనడానికి సంకేతంగా  భావిస్తున్నారు.   విజయ్ రూపంలో సరికొత్త శక్తి ఉద్భవించడంతో, డీఎంకే ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.