Tamil Nadu Election Results 2026: దశాబ్దాలుగా ద్రవిడ్ పార్టీల కంచుకోటగా ఉన్న తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, రాష్ట్ర రాజకీయ ముఖచిత్ర పూర్తిగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి అప్పుడే అుగుపెట్టిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన స్ట్రాంగ్ నియోజకవర్గమైన కొలత్తూరులో వెనుకంజలో ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు అక్కడ ముఖ్యమంత్రిపై ఆధిక్యాన్ని ప్రదర్సిస్తున్నారు. కేవలం స్టాలిన్ మాత్రమే కాకుండా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం చెపాక్ తిరువల్లికేణి నియోజకవర్గంలో వెనుకబడి ఉన్నారు.
ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం 100కుపైగా నియోజక వర్గాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 80 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార డీఎంకే మాత్రం 50 స్థానాలకే పరిమితం అయ్యింది.
విజయ్ టీవీకే బ్లాక్ బస్టర్ డెబ్యూ
తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఉన్న విజయ్, తన రాజకీయ పార్టీ టీవీకే స్థాపించి మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం 234 స్థానాల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేశారు. ఆయన సినిమా ఇమేజ్ ఓట్లుగా మారుతుందా అన్న సందేహాలు ఈ ఫలితాలకు సమాధానం చెబుతున్నాయి.
ఆది నుంచి టీవీకే దూకుడు
తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ లేనివిధంగా 84.63 శాతం భారీ పోలింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం మార్పునకు సంకేతంగా విశ్లేషకులు భావించారు. ఇవాళ ఓట్ల లెక్కింపు కాగానే టీవీకే ఆధిక్యం స్పష్టమైంది.
ప్రముఖులు వీళ్లే
ఈ ఎన్నికల్లో అందరి దృష్టి కీలకమైన నియోజకవర్గాలపై ఉంది. కొలత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేశారు. ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. చెపాక్- తిరువెల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ పోటీ చేశారు. అక్కడ వెనుకంజలో ఉన్నారు. ఎడప్పాడిలో ఏఐఏడీఎంకే అధఇనేత ఎడ్పాడి పళని స్వామి పోటీ చేసి ముందంజలో ఉన్నారు. పన్నీర్ సెల్వం పోటీ చేసిన బోడినాయకనూర్‌లో విజయం దిశగా సాగుతున్నారు.
ఊహించని సర్వే సంస్థలు
తమిళనాడులో గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందా లేదా, విజయ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ ఈ ఫలితాలకు కారణమా అన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనా వేసినప్పటికీ ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే 98-120 స్థానాలు సాధిస్తుందని ముందే ఊహించింది. అదే సమయంలో 37 శాతం మంది ప్రజలు విజయ్ తదుపరి సీఎంగా చూడాలనుకుంటున్నారని ఆ సర్వే వెల్లడించింది. ఒక వేళ ఇదే ట్రెండ్ కొనసాగితే, తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే- ఏఐ డీఎంకే ద్వైపాక్షిక రాజకీయాలకు విజయ్ గండికొట్టినట్టే కనిపిస్తోంది.
