Rajasthan Assembly Election Results:
రాజస్థాన్‌లో బీజేపీ లీడ్..
రాజస్థాన్ ప్రస్తుత ఎన్నికల ఫలితాల (Rajasthan Election Results 2023) ట్రెండ్ చూస్తే అధికార కాంగ్రెస్ వెనకబడింది. కీలకమైన నియోజకవర్గాల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ కన్నా ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గహ్లోట్ పని అయిపోయిందంటూ తేల్చి చెబుతున్నాయి. రాజస్థాన్‌లో 1993 నుంచి ఓ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారిపోతూ ఉంటుంది. ఈ సారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ని పక్కన పెట్టి బీజేపీకే ఓటర్లు మొగ్గు చూపినట్టు ప్రస్తుత ఫలితాల (Election Results 2023) ట్రెండ్ స్పష్టంగా చెబుతోంది. నిజానికి రాజస్థాన్ కాంగ్రెస్ పూర్తిగా సంక్షేమ పథకాలపైనే ఆధారపడింది. ఇవే తమను గెలిపిస్తాయని ధీమాగా ఉంది. కానీ...శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం ప్రభుత్వంపై విశ్వాసాన్ని కొంత వరకూ తగ్గించిందన్న వాదనలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ కూడా గట్టిగానే ప్రచారం చేసింది. ఇక పార్టీలో అంతర్గత విభేదాలూ కొంత డ్యామేజ్ చేశాయి. ఈ సమస్యల్నే తమకు అదనుగా మలుచుకుంది బీజేపీ. ఇప్పుడు ఫలితాలూ బీజేపీకి సానుకూలంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి.
కీలక నియోజకవర్గాల్లో ట్రెండ్ ఇదీ..
నియోజకవర్గాల పరంగా ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా చూస్తే..సర్దార్‌పురలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ (Ashok Gehlot) లీడ్‌లో ఉన్నారు. టాంక్ నియోజకవర్గంలో మాజీ డిప్యుటీ సీఎం సచిన్ పైలట్ దూసుకుపోతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెనకంజలో ఉన్నారు. జోత్వారాలో బీజేపీ అభ్యర్థి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెనకంజలో ఉండగా...కోటా నార్త్‌లో కాంగ్రెస్ నేత శాంతి ధరివల్ వెనకబడ్డారు. జలరాపటన్ నియోజకవర్గంలో బీజేపీ కీలక అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే లీడ్‌లో ఉన్నారు. అయితే...విజయం సాధించే అవకాశాలున్న కాంగ్రెస్ అభ్యర్థులందరూ జైపూర్‌కి రేపు మధ్యాహ్నంలోగా చేరుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే అశోక్ గహ్లోట్ పార్టీ నేతలతో వర్చువల్‌గా భేటీ అయ్యారు.