Rajam Constituency Political Scenario: శ్రీకాకుళం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం రాజాం. ఈ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి రిజర్వుడు స్థానంగా ఉంటూ వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు రెండుసార్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. వచ్చే ఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారుతోంది.


రెండు లక్షల 13 వేల మందికి పైగా ఓటర్లు


నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాజాం నియోజకవర్గం ఏర్పాటయింది. తొలి నుంచి ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా ఉంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,13,768 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,07,125 మంది పురుషు ఓటర్లు ఉండగా, 1,06,630 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 1000 మంది పురుష ఓటర్లు మహిళల కంటే అధికంగా ఉన్నారు.


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల తీరు


2009లో తొలిసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నికల్లో కోండ్రు మురళీమోహన్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండ్రు మురళీమోహన్ తన సమీప ప్రత్యర్థి  తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన ప్రతిభా భారతపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కోండ్రు మురళి మోహన్ 27,133 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర విభజన  నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి పోటీ చేసిన ప్రతిభా భారతిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంబాల జోగులు 512 స్వల్ప ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లోను మరోసారి కంబాల జోగులు ఇక్కడి నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోండ్రు మురళీమోహన్ పై కంబాల జోగులు 16,848 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించకపోవడం గమనార్హం. రెండుసార్లు వైయస్సార్సీపీ అభ్యర్థుల విజయం సాధించగా, ఒకసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. రాజాం, రేగిడి ఆముదాలవలస, వంగర, సంతకవిటి మండలాల్లోని ప్రజలు ఈ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. 


 ఆసక్తికరంగా మారిన పోరు


ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి విజయాన్ని దక్కించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను పన్నుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన  కోండ్రు మురళీమోహన్ ను మరోసారి ఇక్కడ నుంచి బరిలోకి దించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అయితే, ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు ఇక్కడ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిభా భారతి ఇక్కడ నుంచి తన కుమార్తెను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు మురళి మోహన్ తన అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో పార్టీ నష్టపోతున్నట్లు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సిపి నుంచి  కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతున్నారు. ఇక్కడ రెండు సార్లు విజయం సాధించిన కంబాల జోగులను పాయకరావుపేటకు ఆ పార్టీ నాయకత్వం బదిలీ చేసింది. డాక్టర్ గా సేవలందిస్తున్న మరో వ్యక్తిని ఇక్కడ బరిలోకి దించబోతోంది. వైసిపి కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు నేపథ్యంలో ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో చేరింది. విజయనగరం జిల్లాపై ఆధిపత్యం చెలాయిస్తున్న బొత్స కుటుంబం ఈ నియోజకవర్గంపై పట్టు నిరూపించుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఇది కొంత వరకు వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో.