Andhra Pradesh News: ఒకప్పుడు జమిందారులు పాలించిన పిఠాపురం(Pithapuram) సంస్థానానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. సంగీత, సాహిత్య, ఆధ్యాత్మికతను పెంచి పోషించడంలో పిఠాపురం సంస్థానం ప్రత్యేకతను చాటుకుంది.. కాకినాడకు కేవలం 26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలోనే కాదు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి తెలిసిన ప్రతి చోటా హాట్‌ టాపిక్‌గా మారింది.


ప్రతీ ఎన్నికల్లోనూ విభిన్న తీర్పునిచ్చే ఇక్కడి ఓటర్లు ఈసారి ఏ పార్టీకి జై కొడతారో అని ఆసక్తి నెలకొంది. పిఠాపురం మున్పిపాలిటీ(Pithapuram Municipality), గొల్లప్రోలు(Gollaprolu), కొత్తపల్లి(Kothapally ) మండలాలు కలబోసిన ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం. అందుకే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) దృష్టిపడింది. ఆయన పోటీచేస్తుండడంతో ఈ నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఈ నియోజకవర్గ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. జనసేనాని అభ్యర్ధిత్వానికంటే ముందే వైసీపీ కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉంచింది. 


జనసేన అధ్యక్షుడు పోటీ ఇందుకేనా.. 
కాకినాడ జిల్లాలో కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ఉన్నాయి. అయితే ఇందులో జనసేనకు పట్టున్న నియోజకవర్గాలుగా పిఠాపురం, అమలాపురం, రాజోలు కనిపిస్తున్నాయి. ఇందులో పిఠాపురం మినహా అమలాపురం, రాజోలు రెండూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలే. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు అంత అనుకూలం కాకపోవడంతో ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఆ తప్పు జరక్కుండా ఉండేందుకు జనసేన సర్వే విభాగం పిఠాపురంలో పటిష్టంగా సర్వే చేసింది. కాపు ఓట్లు అత్యధికంగా ఉండడంతో పవన్‌ కల్యాన్‌ ను పిఠాపురం నుంచే పోటీచేయాలని పార్టీ కేడర్‌ ప్రోత్సహించింది. దీంతో ఆయనే పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ఇటీవలే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించారు. 


విభిన్న తీర్పులిచ్చిన నియోజకవర్గం..
పిఠాపురం నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పునే ఇచ్చారు. 2004లో రాష్ట్ర మంతా దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగిస్తే ఇక్కడ బీజేపీ తరపున పోటీచేసిన ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఎస్వీఎస్‌ఎన్‌ వర్మను కాదని పోతుల విశ్వానికి టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది.. వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబు పోటీచేశారు. టీడీపీ రెబల్‌ అభ్యర్ధిగా పోటీలో దిగిన ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ 47,080 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2019లో ఒకప్పుడు బీజేపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


భగ్గుమన్న పిఠాపురం.. శాంతించిన వర్మ..
జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా పిఠాపురం నుంచి తాను పోటీచేస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో పిఠాపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర సామాగ్రికి నిప్పుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఈ వీడియోలు నెట్టింట్‌ తెగ వైరల్‌గా కూడా మారాయి. ఈక్రమంలోనే టీడీపీ అధిష్టానం వర్మను పిలిపించుకుని బుజ్జగించింది. ఎమ్మెల్సీ ఆఫర్‌ను చేసి ఆయన కేడర్‌ను చల్లార్చింది.. 


అందరూ బలమైన అభ్యర్థులే..
పిఠాపురం బరిలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీలో ఉండడంతో జనసేన పార్టీ నాయకులు, కేడర్‌ అంతా ఇక్కడే ఉండి తమ నాయకుడ్ని ఎలాగైనా నెగ్గించుకోవాలన్న కసితో పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బరిలో ఉన్న వంగా గీతకు కూడా ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గతంలో ప్రజారాజ్యం తరపున ఆమె ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ ఈక్వెషన్స్‌తోనే ఆమెను పిఠాపురం నుంచి వైసీపీ బరిలో దింపింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వంగా గీతకు టిక్కెట్టు ఇవ్వడం వైసీపీ ఓటు బ్యాంకు కొంతవరకు పక్కకు మళ్లే అవకాశాలు లేకపోలేదని పలువురు చెబుతున్నారు. అదే సమయంలో వర్మకు కాదని పవన్‌కల్యాణ్‌కు టిక్కెట్టు కేటాయించడం టీడీపీ శ్రేణుల ఓట్లు చెదిరిపోయే అవకాశం లేకపోలేదని మరికొందరు చెబుతున్నారు. 


కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న జనసేనాని..
పిఠాపురం నుంచి తాను పోటీచేస్తుండడంతో తనను ఎలాగైనా ఓడిరచాలని వైసీపీ నాయకులు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఓ సందర్భంలో మాట్లాడారు. తనను ఓడిరచేందుకు రూ.100 కోట్లు బడ్జెట్లు అట అంటూ సెటైర్లు వేశారు. వైసీపీ అవినీతి సొమ్ము ఎంత కుమ్మరించినా తన గెలుపును ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వంగా గీత కూడా తననే ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.