Parakala Prabhakar Interview : పరకాల ప్రభాకర్ .. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారు ఉండరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన లేకపోయినా అన్ని విషయాల్లోనూ ఆయనకు తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతూ వార్తల్లో నిలుస్తూంటారు. ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతూంటాయి. ఈ క్రమంలో ఏబీపీ దేశంతో ఆయన సుదీర్గమైన సంభాషణ జరిపారు. వాటి వివరాలు.
పదేళ్ల బీజేపీ పాలనలో ఏమీ లేదు - పాజిటివ్ లేదు
పదేళ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని పరకాల ప్రభాకర్ చెప్పారు. రెండు సార్లు గెలవడం వెనుక భావోద్వేగ రాజకీయాలే ఉన్నాయన్నారు. 2014లో మొదటి సారి గెలిచినప్పుడు యూపీఏ రెండు విడతల ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత తో పాటు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగ ఏదో సాధంచారన్న ఓ ప్రచారాన్ని ఉద్దృతంగా చేయడం వల్లనే విజయం సాధించిందని తెలిపారు. 2019 సమయంలో పుల్వామా ఉగ్రదాడిని రాజకీయంగా వాడుకున్నారు. జవాన్ల మరణాలను రాజకీయంగా వాడుకుని దేశభక్తి పేరుతో రాజకీయం చేసి గెలిచారని పరకాల ప్రభాకర్ విశ్లేషించారు. అయితే ఇప్పుడు ప్రజలకు అంతా తెలిసిపోయిందని పదేళ్ల కాలంలో ప్రజలకు ఏమీ చేయలేదని తెలిసిపోయిందన్నారు. అందుకే ఇప్పుడు మరోసారి గెలిచే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు.
మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అనుకూల సర్వేలు
ప్రధానమంత్రిగా మోదీ మూడో సారి గెలుస్తారని అనేక సర్వేలు వస్తున్నాయి. ఈ సర్వేలు విశ్వసనీయమైనవి కావని పరకాల ప్రభాకర్ గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుతం దేశం లో మీడియా మొత్తం బీజేపీ గుప్పిట్లో ఉందన్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం కూడా అంతేనన్నారు. పరిపాలన ఎంత వరస్ట్ గా ఉందో చూసిన తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లేస్తారని ప్రశ్నించారు. అదే సమయంలో రాజకీయ పరిణామల ప్రకారం చూసినా.. బీజేపీ కొత్తగా ఏ రాష్ట్రంలోనూ మెరుగుపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కొన్ని తప్ప అన్నీ స్వీప్ చేశారు. అక్కడ అంతకు మించి గెలవడానికి సీట్లు లేవు. కొత్తగా దక్షిణాదిలో కోల్పోవడమే తప్ప గెలిచేవి ఏవీ లేవని పరకాల ప్రభాకర్ స్పష్టం విశ్లేషించారు.. ఇంతగా ఇబ్బంది పడిన ప్రజలు శిక్షిస్తారు కానీ ఎందుకు ఓటేస్తారని పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు.
చెప్పుకునే ఘనతల వల్ల ఒక్క ఓటు కూడా అదనంగా రాదు !
బీజేపీ తాము పెద్ద సమస్యలను పరిష్కరించామని చెప్పుకుంటోంది. అలాంటి వాటిలో ఆర్టీకల్ 370 , రామ్ మందిర్, సీఏఏ ఎన్నార్సీ వంటివి ఉన్నాయి. ఈ ఘనతపై పరకాల ప్రభాకర్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అదేమిటంటే.. ఇవన్నీ కొద్ది మంది ఎజెండా. ఇవి పూర్తి చేసినా చేయకపోయినా ఆ అజెండాతో ఉన్న వారు బీజేపీకి ఓటేస్ారు. ఇవి పూర్తి చేయడం వల్ల నేను బీజేపీకి ఓటేస్తాను అని అభిప్రాయం మార్చుకున్న వారు ఒక్కరు కూడా లేరని పరకాల ప్రభాకర్ అభిప్రాయం. అలాగే తాము ఎంతో అభివృద్ది చేశామని చెప్పుకుంటున్నారు. కానీ అభివృద్ధి మొత్తం ప్రచారంలోనే ఉంటుందన్నారు. ఆరు లైన్ల జాతీయ రహదారిని కిలోమీటర్ వేసి ఆరు కిలోమీటర్లు లెక్కలోకి రాసుకుంటున్ారని.. మొత్తం అభివృద్ధి ఇలాంటిదేనని పరకాల ప్రభాకర్ తేల్చేశారు.
పేదరికంలోకి వెళ్లిపోయిన దేశ ప్రజలు
పదేళ్ల బీజేపీ, మోదీ పాలనలో ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారని పరకాల ప్రభాకర్ కొన్ని ఉదాహరణలు చెప్పారు. కరోనా తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న సొమ్ములన్నీ తాకట్టు పెట్టుకున్నారు. బ్యాంకుల్లోనే గోల్డ్ లోన్స్ లక్ష కోట్లు దాటిపోయాయి. ఇక ప్రైవేటు సంస్థల వద్ద ఇంకా రెట్టింపు తాకట్టు ఉంది. దీనర్థం ప్రజలు ఆర్థిక స్థోమత కోల్పోయారని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేశామని ప్రచారం చేస్తూంటారు.. అయితే 82 కోట్ల మందికి ఎందుకు ఉచిత రేషన్ ఇస్తున్నారని పరకాల ప్రశ్నించారు. ప్రజల సేవింగ్స్ తగ్గిపోయాయని.. రాను రాను పేదరికం పెరుగుతోందని పరకాల విశ్లేషించారు.
మోదీ మరోసారి గెలిస్తే ప్రజాస్వామ్యం ఉండదు !
ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగం ఉండదని పరకాల ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ సంస్థల నిశ్చితాభిప్రాయం రాజ్యంగం మార్చడం.. రిజర్వేషన్లు తీసేయడమేనని స్పష్టం చేశారు. హిందూ రాజ్యంగా మార్చి.. ఇతరుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయిందని స్పష్టం చేశారు. మరో సారి బీజేపీ గెలిస్తే రష్యా. నార్త్ కొరియా తరహా ప్రజాస్వామ్యంలోకి వెళ్లిపోతామన్నారు. చండిగఢ్ లో ఏం జరిగిందో చూశామని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. మనది ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాను అందరికంటే దేశభక్తుడినని కానీ బీజేపీ, ఆరెస్సెస్ నేతలకు స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర ఉందో చెప్పాలన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం
ఎలక్టోరల్ బాండ్లను ప్రపంచంలోనే అతి పెద్ద స్కాంగా పరకాల ప్రభాకర్ అభివర్ణించారు. వ్యాపారులను బెదిరించి విరాళాల పేరుతో లంచాలు తీసుకుందని..దీనికి తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. చేసిన చట్టమే దీనికి అవకాశం కల్పించిందన్నారు. సుప్రీంకోర్టు కొట్టి వేసి విరాళాలు ఇచ్చిన వారి వివరాలు బయట పెట్టడంతో గుట్టంత బయటపడిందని విచారణ జరిపితే అసలైన స్కాం వెలుగులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును కూడా మోదీ ప్రభుత్వం బెదిరించిందన్నారు.
ఇవ్వాలనుకుంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొచ్చు..!
ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని.. కేంద్రం మోసం చేసిందని పరకాల ప్రభాకర్ అన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.
పరకాల ప్రభాకర్ తో ఏబీపీ దేశం పూర్తి ఇంటర్యూను ఈ లింక్‌లో చూడవచ్చు.