Assam Exit Polls 2026: అస్సాం రాజకీయాల్లో మరోసారి హిమంత్ బిశ్వ శర్మ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 9న ముగిసిన 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతోందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అభివృద్ధి, హిందుత్వ అజెండా, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది.
అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 64. ప్రముఖ సర్వే సంస్తళు వెల్లడించిన అంచనాల ప్రకారం...
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు
ఈ సంస్థ అంచనాల ప్రకారం బీజేపీ కూటమి 85 నుంచి 95 స్థానాలు గెలుచుకనే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేవలం 25-32 స్థానాలకే పరిమితం కానుంది. ఇతరులు, ఏఐయూడీఎఫ్ ఆరు నుంచి 12 స్థానాలు సాధించవచ్చు.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా అంచనాలు
ఈ సర్వే ఎన్డీయేకు మరింత భారీ మెజారిటీని కట్టబెట్టింది. బీజేపీ కూటమి 88 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 24-36 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.
ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఎన్డీఏ సుమారు 45 శాతం ఓట్ల నుంచి 48 శాతం ఓట్లను సాధించవచ్చు. కాంగ్రెస్ కూటమి 38 నుంచి 40 శాతం ఓట్లు పొందవచ్చని లెక్కలు చెబుతున్నాయి.
ప్రాంతాల వారీగా ఓటర్ల నాడి
అస్సాం భౌగోళికంగా, సామాజికంగా భిన్నమైన ప్రాంతాలను కలిగిఉంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అన్ని ప్రాంతాల్లోనూ తన పట్టును చాటుకోబోతోందని చెబుతున్నారు. అప్పర్ అస్సాంలో బీజేపీ కూటమి 21-22 స్థానాలను గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ మూడు నుంచి ఐదు స్థానాలకు పరిమితం కావచ్చని అంటున్నారు. ఇక్కడ అహోం సామాజిక వర్గాల ఓట్లు చాలా కీలకం. లోయర్ అస్సాంలో బీజేపీ కూటమి 19-21 స్థానాలతో ఆధిపత్యం ప్రదర్శించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ 9-11 స్థానాలు సాధించవచ్చు. బరాక్ వ్యాలీలో బెంగాలీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా బీజేపీ కూటమి 9-10 మధ్య స్థానాలు కాంగ్రెస్ 3-4 స్థానాలు గెలుచుకోవచ్చు. బోడోలాండ్ ప్రాంతీయ జిల్లాల్లో బీజేపీ కూటమి 12-13 స్థానాలతో క్లీన్ స్వీప్ చేయవచ్చు. అక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవడం లేదని అంచనాలు చెబుతున్నాయి.
బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు
2023లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్. దీని వల్ల మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థానాలు 35 నుంచి 23కు తగ్గాయి. ఇది స్వదేశీ, గిరిజన జనాభా ప్రభావం ఉన్న చోట్ బీజేపీకి భారీగా కలిసి వచ్చింది.
Also Read: కేరళలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పేది ఒక్కటే - లెఫ్ట్ పార్టీలకు ఎగ్జిట్ - కాంగ్రెస్ కూటమికి పీఠం !
ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తన దూకుడు రాజకీయాలతో ప్రజల్లో బలమైన ముద్రవేశారు. చొరబాటుదారుల అంశం, అభివృద్ధి పథకాలు ఆయనకు అనుకూలంగా మారాయి. తన సొంత నియోజకవర్గంలో 80 శాతం ఓట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బీజేపీలోకి వలస వెళ్లడం ఆ పార్టీని దెబ్బ తీసింది. మాజీ అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా, ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ వంటి వారు ఎన్నికలకు ముందు పార్టీని వీడటం కాంగ్రెస్‌ను సంస్థాగత బలాన్ని తగ్గించింది. అలాగే ఏఐయూడీఎఫ్‌తో పొత్తు లేకపోవడం కూడా కాంగ్రెస్ ఓట్ల చీలికకు దారి తీసింది.
అస్సాం రాజకీయ చరిత్రలో వరుసగా మూడోసారి ఒకే కూటమి అధికారంలోకి రావడం అనేది అరుదైన విషయం. గతంలో కాంగ్రెస్ హయాంలో తరుణ్ గొగోయ్ అటువంటి ఘనత సాధించారు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ అదే బాటలో పయనిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో హిమంత భార్య రినికి భూయాన్ శర్మ ఆస్తుల వివాదం, పాస్‌పోర్ట్ అంశంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. కానీ అవి ఓటర్ల తీర్పును మార్చినట్టు ఎగ్జిట్ పోల్స్ సూచించడం లేదు.
