Lets Vote Elections 2024 :  ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం ఉండటం ప్రజాస్వామ్యం. అంటే మనల్ని ఎవరు పరిపాలించాలో మనమే డిసైడ్ చేసుకుంటాం. అధికారంలో ఎవరు ఉండాలి.. అధికారంలో ఉన్న వారు తప్పు దారి పట్టకుండా ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో కూడా ప్రజలే నిర్ణయించాలి.  రజలు తమ ఓటును సక్రమంగా వినియోగించుకున్నప్పుడే  ప్రజాస్వామ్యం మరింత బలోపేతతం అవుతుంది. దేశంలో ఎప్పుడైనా 60 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంది. అంటే పాతిక నుంచి ముఫ్ఫై శాతం మంది ఓటర్లు ఓట్లేయడం లేదు.  దేశంలో అయితే ఇంకా తక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం ఓటింగ్ జరిగింది.  మిగిలిన 33  శాతం ఓట్లేస్తే ఫలితం ఎలా ఉండేది ? .  అదే సమయంలో పల్లెల్లో కన్నా పట్టణాల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా  ఉంటోంది.  


ప్రతి ఒక్క పౌరుడి  బాధ్యత ఓటు హక్కు వినియోగం
 
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించి హక్కు ఇచ్చేది ఓటు.   మన రాష్ట్ర .. దేశ స్థితిగతులనే  మార్చే శక్తి ఓటుకు ఉంది.   ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు.  కానీ అది రాజకీయం కాదు. మన బాధ్యత.  మన పిల్లలను భవిష్యత్ వేస్తున్న బాట లాంటిది. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది.  ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది.  ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తాయి.  అయినా ఓటు వేయడానికి బద్దకిస్తున్నారు.లాంగ్ హాలీడేస్ వచ్చాయని  సొంత పనులు చేసుకుంటున్నారు. ఓటు ప్రాధన్యతను గుర్తించలేకపోతున్నారు.  సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, పట్టణ ప్రాంతాలు, మహానగరాల్లోని సంపన్న వర్గాలు ఓటింగ్ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు.


చదువుకున్న వారే ఎక్కువగా ఓటేయడం లేదా ? 


ప్రజాస్వామ్యానికి ఓటే ఊపిరి. ఓటింగ్ ఎంత తక్కువగా జరిగితే ప్రజాస్వామ్యం అంత బలహీనపడినట్లే. ఎంత ఎక్కువగా జరిగితే అంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు. కానీ మన దేశంలో ఓటింగ్ రాను రాను తగ్గిపోతోంది. పంచాయతీల ఎన్నికల్లో 90 శాతం వరూ ఉండేపోలింగ్...  అసెంబ్లీ ఎన్నికలకు 80 శాతం.. పార్లమెంట్ ఎన్నికలకు అరవై శాతానికి పడిపోతోంది. అంటే ప్రజలు ఓట్లేసే విషయంలో ప్రాధాన్యతలను తగ్గించుకుంటూ వస్తున్నారు. స్థానిక ప్రభుత్వాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు .  ఎన్నికల్లో ఓటేసేవారు తగ్గిపోతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రెండు విడతల్లో  ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే తక్కువగా నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ముగిసిన 189 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల శాతం 3 నుంచి 4 శాతం దాకా తగ్గింది. తొలి విడతలో 101 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగితే ప్రస్తుత ఎన్నికల్లో 66.14 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019లో ఇవే నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 70 శాతం దాకా ఓటర్లు ఓట్లు వేశారు. రెండో దశలో కూడా ఇదే ఓటింగ్ తీరు కనిపించింది. ఇటీవల ముగిసిన రెండో దశలో 88 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం 66.71 శాతం ఓటర్లు ఓట్లు వేస్తే గడిచిన ఎన్నికల్లో ఓటర్లు ఇక్కడ 70 శాతం దాకా ఓట్లు వేశారు.


మూడు విడతల్లో తగ్గిన పోలింగ్ 


మొత్తం 2019తో ప్రస్తుత పోలింగ్ శాతాన్ని పోలిస్తే 3.5 నుంచి 4 దాకా పోలింగ్ శాతం పడిపోయింది.  ఓటింగ్ శాతం తగ్గడానికి మండే ఎండలే కారణమని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. కానీ అది ఓ కారణమే అనుకోవచ్చు.  స్థానిక సంస్థల ఎన్నికుల అంచే పంచాయతీ , వార్డు సభ్యుల ఎన్నికలు ఇప్పుడు పెడితే 90 శాతానికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. తమ పంచాయతీ ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు దూరాభారమైనా వస్తారు. అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అంతే. కాకపోతే ఇక్కడ ఆసక్తి కాస్త తగ్గుతుంది. లోక్ సభకు వచ్చే సరికి ఇంకా తగ్గుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఎనభై శాతం వరకూ పోలింగ్ జరుగుతుంది. కానీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ మాత్రమే జరుగుతోంది. గత అసెంబ్లీ కన్నా ఓటింగ్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. 


జయాపజయాలు తారుమారు చేస్తున్న తగ్గే పోలింగ్ 


తగ్గిపోతున్న ఓటింగ్ విజేతల జయాపజయాలను తారుమారు చేస్తోంది.  గతంలో ఎన్నికల ఫలితాలు, సెఫాలజిస్టుల అంచనాలపై చర్చలు సాగుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఓటింగ్ తక్కువైతే, ఎక్కువైతే అధికార పక్షానికి, విపక్షానికి లాభం జరుగుతుందనే శాస్త్రీయ అంచనాలు అయితే లేవు. ఎవరికి అనుకూలంగా వారు ఓటర్ టర్నవుట్‌ను మలుచుకుని జోస్యాలు చెబుతున్నారు.  ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉన్నా.. ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోతుదంని అనుకోవచ్చు. ఎందుకంటే మనది మెజార్టీ ప్రజాస్వామ్యం.  అంటే వంద ఓట్లు ఉంటే 51 ఓట్లు తెచ్చుకున్న వారు పాలకులు కాలేరు. 31 శాతం ఓట్లు తెచ్చుకున్న వారూ పాలకులు అవుతున్నారు. కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారం చేపట్టిన బీజేపీ కి వచ్చిన ఓట్లు 36 శాతమే. ఇతర పార్టీలు ఓట్లు చీల్చడంతో ఇది సాధ్యమయింది. ఓటేసేవారు తగ్గే కొద్దీ .. మెజార్టీ ప్రజల మద్దతు లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ప్రజలు  ఓటింగ్ ను తమ ప్రయారిటీగా మార్చుకోవాల్సి ఉందన్న అభిప్రాయం ప్రాజస్వామ్య నిపుణుల్లో ఉంది. 


ఓటర్ల జాబితాలో పొరపాట్లూ కారణమే !
 
ఓటు వినియోగం పర్సంటేజీ తక్కువగా నమోదవడానికి ఓటర్ల జాబితాలో పొరపాట్లు కూడా కారణమన్న విమర్శలు ఉన్నాయి.   ఓటరు గుర్తింపు కార్డులున్నా ఓటరు జాబితాలో పేరు లేకపోవటం, దరఖాస్తు చేసుకున్నా.. ఓటు ఇవ్వకపోవడం... అలాగే.. ఊళ్లలో ఓట్లు ఉన్నా.. డూప్లికేటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల..  ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఓటర్ జాబితాల్లో అక్రమాలు పెరిగిపోతూండటం .. ఈసీ  రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేకపోవడం కూడా సమస్యే.