తెలంగాణలో ఎన్నికల్లో చాలా మంది మంత్రులు పట్టు కోల్పోతున్నారు. ఓటమి దిశగా పయనిస్తున్నారు. ప్రత్యర్థుల కంటే చాలా వెనుకబడి ఉన్నారు. మరికొందరు ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 


కరీంనగర్‌లో మంత్రి గంగుల కమాలకర్‌ మొదట్లో కాస్త వెనుకబడినా తర్వాత పుంజుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో గంగుల పోటీ పడుతున్నారు. నాలుగు రౌండ్‌లు ముగిసే సరికి బండి సంజయ్‌ను వెనక్కి నెట్టి ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు, మొదటి రెండు రౌండ్లలో బండి సంజయ్‌ కాస్త ఆధిక్యంలో కనిపించారు. కానీ తర్వాత బండి వెనుకబడిపోయారు. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 


సూర్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి జగదీష్‌ రెడ్డి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదట్లో కాస్త తడబాటు కనిపించినా తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై పైచేయి సాధిస్తున్నారు. 
మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న మల్లారెడ్డి కూడా ఆధిక్యంలో ఉన్నారు. తన ప్రత్యర్థి రాజేశ్‌రెడ్డిపై పూర్తి స్థాయి మెజార్టీ సాధించారు. 


తిరుగు లేని హరీష్‌రావు 
సిద్దిపేటలో హరీష్‌రావుకు తిరుగు లేదని మరోసారి రుజువైంది. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు నుంచి ఆయన దూసుకెళ్తున్నారు. ఎక్కడా ఆధిక్యం తగ్గలేదు. రౌండ్‌లు పెరుగుతున్న కొద్ది ఆధిక్యంలో పెంచుకుంటూ ఉన్నారు. 


కేటీఆర్‌ ఆధిక్యం 
మంత్రి కేటీఆర్‌ మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తర్వాత ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. సిరిసిల్లా కేటీఆర్ ఖిల్లా అన్నట్టు ముందంజలో ఉన్నారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె ముందంజలో ఉన్నారు.