Andhra Pradesh Elections 2024: అనకాపల్లి ఎంపీ స్థానంపై వైసీపీలో తర్జనబర్జన కొనసాగుతోంది. ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై వైసీపీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మొన్నటి వరకు యలమంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, విశాఖ డెయిరీ సంస్థ వ్యవస్థాపకులు ఆడారి తులసీరావు కుమార్తె రమాకుమారి పేరును తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన్సాల భరత్‌ కుమార్‌ పేరును అధిష్టానం ఖరారు చేసింది. సిటింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి అయిన గుడివాడ అమర్‌నాథ్‌కు మరోచోట సీటు కేటాయించాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది.


మొదట పార్టీ బాధ్యతలను అమర్‌నాథ్‌కు అప్పగించి వచ్చే ఎన్నికలకు ఆయన సేవలను వినియోగించుకోవాలని వైసీపీ భావించినట్టు ప్రచారం జరిగింది. ఒకానొక దశలో ఎమ్మెల్యే సీటును మన్సాల భరత్‌ కుమార్‌కు కేటాయించిన తరువాత నిర్వహించిన సభలో మంత్రి అమర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, రాజకీయంగా జగన్మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం మరోసారి మంత్రి అమర్‌ పేరును ఎంపీ స్థానానికి పరిశీలనలోకి తీసుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 


కొణతాల రాకతో మారిన సీన్‌


మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గడిచిన కొన్నాళ్ల నుంచి రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. కొద్ది రోజుల కిందటే జనసేనలో చేరారు. పార్టీ సభ్వత్వాన్ని స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ఆయనకు అందించారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి బరిలోకి దిగేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టు అనుచరులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లలో ఒకటి కొణతాలకు ఉంటుందని చెబుతున్నారు. కొణతాల రాజకీయ అనుభవాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్న పవన్‌ కూడా ఆయనకు సముచిత స్థానాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అనకాపల్లి అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దించాలని భావించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు కొణతాలకు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.


ఈ స్థానం నుంచి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ జోరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఆయన ఇప్పటికే సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే సీటును మరొకరికి కేటాయించడంలో ఇబ్బందులుంటాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. టీడీపీ వాదనతో జనసేన ఏకీభవిస్తే కొణతాలకు అనకాపల్లి ఎంపీ సీటును అడిగే అవకాశముందని చెబుతున్నారు. కొణతాల ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగితే కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడ అమర్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని వైసీపీ భావిస్తోంది. అమర్‌ అయితే కొంత వరకు పార్టీకి మెరుగైన అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం విశ్లేషిస్తోంది. అందులో భాగంగానే అమర్‌ పేరును రప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. 


ప్రస్తుత ఎంపీకి ఎక్కడ..?


అనకాపల్లి ప్రస్తుత ఎంపీగా డాక్టర్‌ సత్యవతి ఉన్నారు. ఈ స్థానంలో మార్పులు చేయాల్సి వస్తే.. ఆమెకు ఎక్కడ చోటు కల్పిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అనకాపల్లి ఎంపీగా పని చేసిన డాక్టర్‌ సత్యవతి వివాదాలకు దూరంగా తన పనిని తాను చేసుకుంటూ వెలుతున్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగిస్తే.. దాన్ని నిర్వర్తిస్తానని ఆమె చెబుతున్నారు. కానీ, వైసీపీ ఆమెకు ఎక్కడ అవకాశాన్ని కల్పిస్తుందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఆమె కూడా సైలెంట్‌గా తన ప్రయత్నాలను సాగిస్తున్నారు. మరోసారి ఎంపీగా బరిలో దిగాలని ఆమె భావిస్తున్నారు. లెక్కలు అనుకూలంగా లేకపోతే ఏదో ఒక నియోకజవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. మరి వైసీపీ అధిష్టానం మనసులో ఏముందో చూడాలి. ఇప్పటి వరకు ఎంపీ స్థానానికి ఇద్దరు పేర్లను పరిశీలించిన వైసీపీ.. గలుపు గుర్రాలపై లెక్కలు సరిపడిన తరువాత అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు.