TDP will contest in Khammam MP seat  :  తెలంగాణలో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఎన్నికల సన్నాహాలు చేయలేకపోయారు . పోటీ నుంచి విరమించుకోవడంతో అసంతృప్తితో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరిపోయారు.  పార్లమెంట్ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీ చేస్తుందన్న ఆలోచన చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తులు పెట్టుకున్న బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడంతో ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ సీటుపై చర్చ ప్రారంభమయింది. 


ఖమ్మం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయని బీజేపీ 


తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ పదిహేను  స్థానాలకు అభ్యర్థుల్ని  ఖరారు చేసింది. వరంగల్,  ఖమ్మంకు మాత్రమే పెండింగ్ పెట్టారు. ఖమ్మం నంచి జలగం  వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని అనుకున్నారు. కానీ అధికారిక జాబితాలో జలగం పేరు రాలేదు. అలాగే వరంగల్ లో అభ్యర్థిగా భావించిన ఆరూరి రమేష్ చేరిక విషయంలోనూ హైడ్రామా చోటు చేసుకుంది. అందుకే ఆ సీటు ప్రకటననూ నిలిపివేశారు.  ప్రస్తుతానికి ఆరూరి రమేష్ చేరిపోయారు. ఆయనకే టిక్కెట్ కన్ఫర్మ్ అని  చెబుతున్నారు. కానీ జలగంకు మాత్రం ఖమ్మం టిక్కెట్ ఖారరు అన్న సంకేతాలు రాలేదు. 


ఖమ్మం టీడీపీకి కేటాయించంపై చర్చలు ?


హఠాత్తుగా ఖమ్మం టీడీపీకి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు ప్రారంభమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఖమ్మంలో ప్రస్తుతం తిరుగులేని  ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడింది. గత ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్‌కు సహకరించింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లంతా టీడీపీ నేతల్ని కలిసి మద్దతు అడిగారు. గెలిచిన తర్వాత కూడా వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.  ఖమ్మం రాజకీయ సమీకరణాలతో..  టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని  సర్వేలు తేల్చడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే అక్కడ బీజేపీకి బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. 


అలాంటి ఆలోచనే లేదంటన్న బీజేపీ నేతలు                                   


అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో టీడీపీకి సీటు కేటాయించే ఆలోచనే లేదని అంటున్నారు.  ఇప్పటికే ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును బరిలోకి దింపాలని రాష్ట్ర పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో జలగం మంగళవారం బీజేపీ కార్యాలయంకు వెళ్లారు. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ అయ్యారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీచేసే విషయంపై ఆయనతో జలగం చర్చించినట్లు సమాచారం. చంద్రశేఖర్ తివారితో సమావేశం అనంతరం జలగం వెంకట్రావు మీడియాతో మాట్లాడారు.. ఖమ్మం బీజేపీ టికెట్ తనదేనని చెప్పారు. ఖమ్మం టికెట్ పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.