Andhra Pradesh News: కర్నూలు జిల్లాలో వర్గ విభేదాలతో కర్నూలు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్‌కి తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. ఇప్పుడు మరో కొత్త తలనొప్పి పార్టీకి ఛాలెంజ్‌ విసుసుతోంది. 


కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న బివై రామయ్యను కర్నూలు పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. అప్పటి వరకు రామయ్య మేయర్‌గా కూడా ఉన్నారు. ఎంపి అభ్యర్థిగా ఆయన్ను ఎంపిక చేసిన వెంటనే ఆ స్థానంలో కురువ సామాజిక వర్గానికి చెందిన నగర పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు పార్టీ లీక్‌లు ఇచ్చింది. మేయర్ స్థానానికి ఎన్నిక చేపట్టాలంటే చాలా సమయం కావాలి. నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటే రాజికీయంగా సమస్యలు వస్తాయని ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. 
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కురువలను ప్రసన్నం చేసుకునేందుకు సత్యనారాయణమ్మను జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఈ నిర్ణయంతోనే పార్టీలో చిచ్చు రేగింది. ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్వీ మోహన్‌రెడ్డిని కాదని మరొకరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడాన్ని ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది.


కర్నూలు వైసీపీ టికెట్ కోసం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సహా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కేడీసీసీబీ ఛైర్‌పర్శన్ ఎస్వీ విజయమనోహరి దంపతులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ గెలుపు కోసం అప్పటి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గట్టిగా కృషి చేశారు. ఎమ్మెల్యే హఫీజాఖాన్ గెలిచాక ఎస్వీ వర్గాన్ని పూర్తిగా పక్కన పెడుతూ వచ్చారు. దీంతో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరికి కాకుండా కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన ఐఏఎస్ అధికారి ఏఎం ఇంతియాజ్ అహ్మద్‌తో రాజీనామా చేయించిన సీఎం జగన్ కర్నూలు వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపారు. 


కర్నూలు టికెట్ ఆశించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని, మాజీ ఎస్వీ మోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో ఇద్దరు కూడా ఇంతియాజ్‌తో కలసి ప్రచారం చేపట్టారు. మార్చి 29న ఎమ్మిగనూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో హఫీజ్ ఖాన్‌కు టికెట్ ఇవ్వలేకపోయానని, మన ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో రాజ్యసభకు పంపుతానని జగన్ ప్రకటించారు. అదే క్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిని చేస్తానని జగన్ ప్రకటిస్తారని ఆయన వర్గీయులు ఆశించారు. అయితే ఆ సభలో జగన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ రోజే ఎస్వీ మోహన్ రెడ్డి, ఆయన వర్గీయులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 


జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఎస్వీ మోహన్ రెడ్డికి ఆశాభంగం ఎదురైంది. జిల్లా అధ్యక్షురాలిగా కార్పొరేటర్ సత్యనారాయణమ్మను ఎంపిక చేస్తూ వైసీపీ అధిష్టానం గురువారం ప్రకటన విడుదల చేసింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎస్వీ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. హఫీజ్ ఖాన్ వర్గానికి చెందిన కార్పొరేటర్ సత్యనారాయణమ్మ ఆ పార్టీ నగర అధ్యక్షురాలిగా ఉన్నారు. అదేవిధంగా మేయర్‌గా ఎంపిక చేశారు. ఈ రెండుపదవులకు తోడు తాజాగా జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆమెకే కేటాయించడంతో వైసీపీలో ఎస్వీ మోహన్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యం పేకమేడలా ఒక్కసారిగా కూలిపోయింది. పార్టీలో వరుస పరాభవాలతో ఎస్వీ అనుచరులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.


వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ తన నివాసంలో ఎస్వీ వర్గీయులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహంతో ఎస్వీ వర్గం రగిలిపోయినట్లు తెలుస్తుంది. మా నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆయన ఆదేశాల మేరకు మేము ఎలాంటి పదవి ఆశించకుండా ఐదేళ్లు పార్టీ కోసం పని చేశాం. ఆధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించగానే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ప్రచారం చేశాం. ఏ పదవి అడగకపోయినా మా నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని సంకేతాలు ఇచ్చారు కానీ దక్కలేదు...


మా నాయకుడుకి ఏ హోదా లేకుండా ఏమని ఓట్లు అడగాలంటూ ఎస్వీ వర్గం రగిలిపోతుంది. రాజకీయ కుట్రలో భాగమే అణచివేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ఎదుట ఎస్వీ వర్గం ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల తరువాత ఎస్వీ మోహన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ఇంతియాజ్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయం కూడా ఆనాటి అభ్యర్థి హఫీజ్ ఖాన్ ఇలాంటి మాటలే చెప్పి గెలిచాక మోసం చేశారని ఎస్వీ వర్గీయులు దీటుగా సమాధానమిచ్చారు. ఈ విభేధాలతో కర్నూలు అభ్యర్థి తల పట్టుకుంటున్నాడు. మరి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.