Gedela Srinubabu likely to Join TDP: ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, పల్సస్‌ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు రాజకీయ అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటికీ రైతు, యువత పేరుతో సదస్సులు నిర్వహిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలు, యువతకు ఉద్యోగాలు కల్పించడంపై త నకు విజన్‌ను వివరిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి శ్రీనుబాబు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంగా యాక్టివ్‌ కావాలన్న కోరికను అనేక చోట్ల బయటపెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజికవర్గాని చెందిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasena Party) నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, చివరి నిమిషంలో వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ ప్రకటించిన ఎంవీవీ సత్యనారాయణకు మద్ధతు ప్రకటించారు.


వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తోంది. కానీ, శ్రీనుబాబుకు ఆ పార్టీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ప్రధాన్యతను ఇవ్వలేదు. ఆయన కూడా పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఇన్నేళ్లు ఉంటూ వచ్చారు. మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన యాక్టివ్‌ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు సభలు,ర సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళతారన్న జోరుగా సాగుతోంది. అందుకు అనుగుణంగా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. 


టీడీపీ నేతలతో వరుస భేటీలు 
టీడీపీలో చేరాలని గేదెల శ్రీనుబాబు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన టీడీపీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. శంఖారావం సభల్లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శ్రీనుబాబు వెళ్లి కలిశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావుతోపాటు బొబ్బిలిలో బేబీ నాయనతోపాటు పలువురు కీలక నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారితో రాజకీయపరమైన అంశాలను చర్చించినప్పటికీ వాటిని బయట పెట్టడం లేదు. టీడీపీలో చేరే క్రమంలోనే శ్రీనుబాబు ఆ పార్టీ నేతలతో సమావేశమవుతున్నట్టు చెబుతున్నారు. ఆయన కానీ, ఆయన అనుచరులు కానీ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పడం లేదు. 


విజయనగరం ఎంపీగా బరిలోకి దిగుతారా.. 
పల్సస్‌ సంస్థ అధినేతగా, యువతకు ఉపాధి కల్పించిన వ్యక్తి, తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంత ప్రజలకు గేదెల శ్రీనుబాబు సుపరిచితులు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఆశించిన స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించలేకపోయారు. రానున్న ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్‌ స్థానానికి బరిలో దిగేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం పార్లమెంట్‌ (Vizianagaram Parliament) స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగానే విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలతో గేదెల శ్రీనుబాబు వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బలమైన వ్యక్తి కోసం ఇక్కడ అన్వేషిస్తోంది. పార్టీ నుంచి సానుకూల స్పందన వస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు.