Elections Exit Polls : పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. జాతీయ మీడియా చానళ్లతో పాటు తెలంగాణ ఫలితాలపై ఇప్పటి వరకూ వినని, చూడని కంపెనీలు కూడా ఫలితాలను ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో బిన్నమైన ఫలితాలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఒక్క తెలంగాణలోనే కాదు.. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘడ్‌లలో గెలుపు ఎవరిదన్న దానిపై ప్రతిష్టాత్మక సంస్థలు సైతం భిన్నమైన ఫలితాలను ప్రకటించాయి. దీంతో మూడో తేదీన కౌంటింగ్ లో వచ్చే ఫలితాలు ఊహించని షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న మధ్యప్రదేశ్ ఎన్నికలు
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా కాలంగా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే చెప్పారు. కానీ రెండు, మూడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని అంచనా వేశాయి. ఇదే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజార్టీ సాధించినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారిపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీనే .. మళ్లీ శివరాజ్ సింగ్ చౌహానే సీఎం అయ్యారు. కానీ ఆయన పాలనపై చాలా వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. గతంలో కూడా ఎన్నడూ లేనంత మెజార్టీ బీజేపీకి రావొచ్చని అంచనా వేస్తున్నాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీ గెలుపునే అంచనా వేస్తున్నయి. అందుకే మధ్యప్రదేశ్ కౌంటింగ్ సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజస్థాన్ లోనూ ఊహించని ఫలితాలను అంచనా వేస్తున్న ఎగ్జిట్ పోల్స్
రాజస్థాన్ లో ఏ ఒక్క ప్రభుత్వాన్ని రెండో సారి ఎన్నుకున్న సందర్భంగా గత ముఫ్పై ఏళ్లలో లేదు. పైగా కాంగ్రెస్ పార్టీలో సచిన్ పైలట్, గెహ్లాత్ మధ్య ఉన్న ఆధిపత్య పోరాటంతో కాంగ్రెస్ పార్టీ నానా తిప్పలు పడుతోంది. అందుకే పోలింగ్ కు ముందు సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అంచనాలు వచ్చాయి. రాహల్ గాంధీ కూడా ఆశలు పెట్టుకోలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాము గెలుస్తామని ఆ ఒక్క రాష్ట్రం గురించే చెప్పలేదు. కానీ గట్టి పోటీ ఇస్తున్నామని మాత్రం చెప్పుకొచ్చారు. అయితే రాజస్థాన్ లో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో భిన్నమైన ఫలితాలను ఇచ్చినట్లయింది.
తెలంగాణలో కాగం్రెస్ కు ఎడ్జ్ ఉందని ఎగ్జిట్ పోల్స్
తెలంగాణలో దాదాపుగా అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని అంచనా వేశాయి. అందుకే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పాయి కానీ ల్యాండ్ స్డైడ్ విక్టరీని మాత్రం చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ గెలుస్తుందని కానీ బీఆర్ఎస్ విజయానికి దగ్గరగా ఉందని కానీ ఎవరూ చెప్పలేదు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీకి 61 సీట్లు సాధిస్తేనే అధికారం వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 53 సీట్లు చాలు. మజ్లిస్ పార్టీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మజ్లిస్ సీట్లు సరిపోకపోతే.. బీజేపీకి లోటుపడే సీట్లు సాధిస్తే.. బీజేపీ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.
ఎగ్జిట్ పోల్స్ సంగతి ఎలా ఉన్నా.. అసలు రిజల్ట్స్ మాత్రం ఎంతో దూరంలో లేవు. మరి కొన్ని గంటల్లోనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిన రెండు, మూడు గంటల్లో ట్రెండ్స్ తేలిపోతాయి. విజేతలెవరో తేలిపోతుంది. ఆ తర్వాత అసలు రాజకీయ పరిణామాలపై స్పష్టత వస్తుంది.