Ec Orders Cid Investigation Against Ysrcp Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జీ సజ్జల భార్గవరెడ్డిపై (Sajjala Bhargava Reddy) ఎన్నికల సంఘం సీఐడీ విచారణకు ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramayya) ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇంటింటింకీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణం అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పింఛనుదారులు, ఓటర్లను తప్పుదోవ పట్టించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే ఓటర్లు, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని చెప్పారు. కుట్రతో విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. దీంతో ఈ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీని ఆదేశించింది.
మరోవైపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై.. వైసీపీ ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల ప్రచార హోరు, ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఫిర్యాదులు, విచారణలతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.