Election Comission Appointed New Police Officers: రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఈసీ పలువురు పోలీస్ అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు డీఎస్పీలతో పాటు ఐదుగురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలను కొత్తగా నియమించింది. నరసరావుపేట (Narsaraopeta) డీఎస్పీగా ఎం.సుధాకర్, గురజాల (Gurazala) డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవిమనోహర్ చారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా ఎం.వెంకటాద్రి, తాడిపత్రి డీఎస్పీగా జనార్ధన్ నాయుడులకు ఈసీ పోస్టింగ్ ఇచ్చింది. అలాగే, పల్నాడు ఎస్బీ సీఐగా బి.సురేష్ బాబు, పల్నాడు ఎస్బీ సీఐ 2గా యూ.శోభన్ బాబు, తిరుపతి ఎస్బీ సీఐగా విశ్వనాథ్ చౌదరి, అలిపిరి సీఐగా ఎం.రామారావు, తాడిపత్రి సీఐగా పి.నాగేంద్ర ప్రసాద్ లను నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఎన్నికల సమయంలో అల్లర్ల కట్టడిలో విఫలం అయ్యారంటూ పలువురు పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది.


తాజా నియామకాలివే


ఏపీలోని 3 కొత్త జిల్లాలకు సైతం ఎన్నికల సంఘం ఇటీవలే (మే 18న) కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్,  తిరుపతి జిల్లా ఎస్పీగా, హర్షవర్దన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించారు. పోలింగ్, అనంతరం ఈ జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో అక్కడున్న ఎస్పీలపై చర్యలు తీసుకుంది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీని నియమించింది.


ఇంటెలిజెన్స్ అలర్ట్


మరోవైపు, ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక తాజాగా ఇచ్చింది. కౌంటింగ్ కు ముందు తర్వాత కాకినాడ సిటీ (Kakinada), పిఠాపురం (Pithapuram) నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని అప్రమత్తం చేసింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటతో సహా పలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దీంతో ఎన్నికల సంఘం ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టారు. కాగా, జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 


Also Read: AP Election Violence: ఏపీలో అల్లర్ల ఘటనలు - సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం, పోలింగ్ అనంతర హింసపై మరిన్ని కేసులు